ముంబై: ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లకు టెర్రరిస్టు ముప్పు పొంచి ఉందనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలోకి సముద్ర మార్గం ద్వారా లష్కరే తాయిబా ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దీనికి సంబంధించి సోమవారం స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు సుమారు 10 మంది ముంబై రైల్వేస్టేషన్లను టార్గెట్ చేశారనే సమాచారంతో ఈ అలర్ట్ జారీ చేశారు. దీంతో 17 స్టేషన్లకు ఆర్పీఎఫ్ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలను ముమ్మరం చేశారు.
దేశంలో సంచలనం సృష్టించిన 2008 వరుస పేలుళ్లు, 26/11 దాడులకు అబూ యాకూబ్ బాధ్యుడన్న సంగతి తెలిసిందే. సముద్రమార్గం గుండా వచ్చి దాడులు చేయడం అతడి ఆపరేషన్ స్టైల్. ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్న యాకూబ్ పాకిస్తాన్లోని కరాచీ ద్వారా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి.