
తొలి దశలో ఓట్ల రికార్డు
బిహార్ అసెంబ్లీకి సోమవారం జరిగిన తొలి దశ ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది
బిహార్‌లో 57 శాతం పోలింగ్ నమోదు
♦ 49 స్థానాలకు ప్రశాంతంగా..
♦ 2010 ఎన్నికల్లో ఇవే స్థానాల్లో 50.85% పోలింగ్
♦ పోలింగ్‌లో మహిళల పైచేయి
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీకి సోమవారం జరిగిన తొలి దశ ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 243 నియోజకవర్గాలకు గాను సోమవారం 49 నియోజకవర్గాలకు ఎలాంటి హింసాత్మక ఘటనలూ లేకుండా పోలింగ్ పూర్తయింది. 2010 అసెంబ్లీ ఎన్నికల మొత్తం పోలింగ్‌తో పోలిస్తే ఇప్పుడు తొలి దశ పోలింగ్ పెరిగిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అజయ్‌నాయక్ తెలిపారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారన్నారు. పురుషులు 54.5 శాతం మంది ఓట్లు వేస్తే.. మహిళా ఓటర్లలో 59.5 శాతం మంది ఓట్లు వేసినట్లు వివరించారు.
పది జిల్లాల్లోని ఈ 49 స్థానాల్లో 2010 ఎన్నికల్లో 50.85 శాతం పోలింగ్ నమోదయిందని.. దానితో పోలిస్తే ఇప్పటి పోలింగ్ శాతం పెరుగుదల చరిత్రాత్మకమని డిప్యూటీ ఎన్నికల కమిషనర్, బిహార్ ఇన్‌చార్జ్ ఉమేశ్‌సిన్హా ఢిల్లీలో వివరించారు. ఇవే స్థానాలకు 2009 లోక్‌సభ ఎన్నికల్లో 44.08 శాతం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 55 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఏడు స్థానాలున్న ఖగారియా జిల్లాలో అత్యధికంగా 61 శాతం, 5 స్థానాలున్న నవడ జిల్లాలో 53 శాతం పోలింగ్ నమోదైందని సీఈఓ అజయ్‌నాయక్ చెప్పారు.
సమస్తిపూర్‌లో 60, బేగుసరాయ్‌లో 59, భాగల్పూర్‌లో 56, బాంకాలో 58, ముంగేర్‌లో 55, లఖీసరాయ్‌లో 54, షేక్‌పురాలో 55, జాముయ్ జిల్లాలో 57 శాతం చొప్పున పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. అన్ని చోట్లా గత అసెంబ్లీ ఎన్నికల కన్నా పోలింగ్ పెరిగింది. అన్నిచోట్లా పొద్దున 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని 9 సీట్లలో మధ్యాహ్నం 3 గంటలకు, మరో 4 సీట్లలో 4 గంటలకు పోలింగ్ ముగిసింది. భాగల్పూర్, బాంకా, లఖిసరాయ్ జిల్లాల్లోని 9 పోలింగ్ బూత్‌లలో కొందరు ఓటింగ్‌ను బహిష్కరించినట్లు సమాచారం.