మూడోసారీ భారీ బడ్జెట్ | Third time Telangana Huge Budget! | Sakshi
Sakshi News home page

మూడోసారీ భారీ బడ్జెట్

Published Mon, Jan 25 2016 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

మూడోసారీ భారీ బడ్జెట్

మూడోసారీ భారీ బడ్జెట్

* రూ.1.30 లక్షల కోట్లకు చేరనున్న తెలంగాణ ఆర్థిక ప్రణాళిక
* సీఎం సూచన మేరకు కసరత్తును వేగవంతం చేసిన ఆర్థిక శాఖ
* నిరుటిలాగే మార్చిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పునరాలోచన
* మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హౌసింగ్ పథకాలకు రుణాలే దిక్కు!


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడోసారి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. 2015-16లో రూ. 1.15 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించే అవకాశాలున్నాయి.

ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంత మేరకు తగ్గించి ప్రణాళిక పద్దుపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థికశాఖకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వీటికితోడు వాస్తవికతకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉండాలని సూచిం చారు. దీంతో అధికారులు బడ్జెట్ కసరత్తుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రణాళిక పద్దు కేటాయింపులను ముందుగానే శాఖలవారీగా సమాచారం అందించి వాటి ఆధారంగా జిల్లాల అభివృద్ధి కార్డులను తయారీ చేసే కొత్త పంథాను అనుసరిస్తామని సీఎం ఇటీవలే ప్రకటించారు. జనవరి మొదటి వారంలోనే ఈ కసరత్తు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో శాఖల వారీగా బడ్జెట్  కేటాయింపుల ప్రక్రియ ఇప్పటికీ జరగలేదు.

సీఎం ఆదేశాలతో హడావుడి పడ్డ ఆర్థిక శాఖ ప్రాథమికంగా శాఖల వారీ కేటాయింపుల జాబితా తయారు చేసింది. కానీ సంక్రాంతి తర్వాత జరిగిన సమీక్షలో ఆర్థికశాఖ ఇచ్చిన ఈ జాబితాకు సీఎం ఆమోదముద్ర వేయలేదని తెలిసింది. వాస్తవికతకు అద్దం పట్టేలా కేటాయింపులు లేవని, మరోసారి పునః సమీక్షించాలని సీఎం సూచించినట్లు సమాచారం. మిగతా శాఖల అధికారులతో చర్చించాక కేటాయింపుల విషయంలో తుది నిర్ణయం తీసుకుందామని సీఎం అభిప్రాయపడ్డట్లు తెలిసింది. దీంతో శాఖలవారీగా సీలింగ్ బడ్జెట్ ప్రకటించే ప్రక్రియ పెండింగ్‌లో పడింది.
 
కీలక పథకాలపై ఊగిసలాట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కొన్ని పథకాలను ఈసారి బడ్జెట్‌లో పొందుపరుస్తారా..? లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంటింటికీ నల్లా నీటిని అందించే లక్ష్యంతో తలపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు దాదాపు రూ.30 వేల కోట్లు కావాలి. ఈ మొత్తాన్ని వివిధ సంస్థల నుంచి రుణం ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాలకు సైతం రుణాలపైనే ఆధారపడుతోంది. నాబార్డు, హడ్కో, ఎల్‌ఐసీ, రాష్ట్ర బ్యాంకర్ల సమితి నుంచి వీటికి రుణాలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

దీంతో ప్రణాళిక పద్దులో వీటి ప్రస్తావన లేకుండా బడ్జెట్‌ను మిగతా పథకాలకు, పనులకు సర్దుబాటు చేయాలని యోచి స్తోంది. ఈ ఏడాది ప్రణాళిక పద్దు దాదాపు రూ. 62 వేల కోట్లకు చేరుతుందని అంచనా. బడ్జెట్‌లో 18 శాఖలవారీగా నిధుల కేటాయింపులుంటా యి. ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించినట్లు నీటిపారుదలశాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయిస్తే మిగతా రూ. 37 వేల కోట్లను ఇతర శాఖలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు జనాభా ప్రకారం నిధులు కేటాయించటం తప్పనిసరి.

ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 15.44 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్‌కు 9.34 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. 2015-16 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం రూ. 11,450 కోట్లు కేటాయించింది. ప్రణాళిక పద్దు పెరిగిన దామాషా ప్రకారం వచ్చే బడ్జెట్‌లో ఇది కాస్తా రూ.15 వేల కోట్లకు చేరుతుంది. దీంతో మిగతా రూ. 22 వేల కోట్లను ఇతర విభాగాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అందుకే కొన్ని పథకాలకు బడ్జెట్‌లో ఆర్థిక కేటాయింపుల్లేకుండానే రుణాల సమీకరణ ద్వారా చేపట్టే వెసులుబాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
 
మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు
తాజా పరిణామాలతో బడ్జెట్ సమావేశాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ కంటే ముందే...అంటే జనవరి నెలాఖరునే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి ఫిబ్రవరి మొదటి వారంలోనే బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు జారీ చేసింది. కానీ కొత్తగా ఎంచుకున్న బడ్జెట్ తయారీ పంథాతోపాటు గ్రేటర్ హైదరాబాద్, నారాయణఖేడ్ ఉప ఎన్నిక కారణంగా బడ్జెట్ తయారీ ఆలస్యమవుతోంది. గతేడాది మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది కూడా కొంచెం అటుదిటుగా మార్చి మొదటి, రెండో వారంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement