నోట్ల రద్దు: సేఫ్‌గా ఉన్న నగరమిదే!
- దేశంలోనే అతి తక్కువ ప్రభావం ఇక్కడే: క్రెడాయ్
బెంగళూరు: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దేశంలోని అన్ని నగరాలు, అన్ని ప్రాంతాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, బెంగళూరు మాత్రం ఈ విషయంలో కొద్దిగా సేఫ్‌గా ఉందట. నగరంలో చాలావరకు నగదు రహిత పారదర్శక కార్యకలాపాలు సాగుతుండటంతో నోట్ల రద్దు బెంగళూరుపై పెద్దగా ప్రభావం చూపించలేదని కాన్ఫేడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలిపింది.
‘ నోట్ల రద్దుతో చాలా తక్కువగా ప్రభావితమైన నగరాల్లో బెంగళూరు ఒకటి. ఇందుకు కారణం ఇక్కడి మార్కెట్ చాలావరకు పారదర్శకంగా ఉండటం, నగదు కార్యకలాపాలు దాదాపుగా మృగ్యం కావడం’ అని కెడ్రాయ్ చైర్మన్ ఇర్ఫాన్ ఖాన్ శనివారం మీడియాకు తెలిపారు. పెద్దనోట్ల రద్దు వల్ల బెంగళూరు మార్కెట్లో రియల్ ఎస్టేట్ భూముల ధరలు తగ్గుముఖం పడతాయన్న ఊహాగానాలు అతిశయోక్తులు మాత్రమేనని, అలా ధరలు తగ్గుతాయనడానికి ప్రాతిపదిక ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. నగరంలో చాలావరకు ఐటీ, ఐటీఈఎస్ సెక్టర్‌కు చెందిన ఉద్యోగ వర్గం ఉండటం, వీరి కార్యకలాపాలు బ్యాంకు చానెళ్ల ద్వారా కన్జుమర్ సెంట్రిక్ (వినియోగదారుడు కేంద్రం)గా జరగడం వల్ల బెంగళూరు నోట్ల రద్దు వల్ల పెద్దగా ప్రభావితం కాలేదని పేర్కొన్నారు. ఇటీవలికాలంలో బెంగళూరు మార్కెట్ కొంత దిద్దుబాటు చర్యలకు లోనైనప్పటికీ దేశంలో ఇప్పుడు అత్యంత ఆకర్షణీయమైన ధరలతో కూడిన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా కొనసాగుతున్నదని తెలిపారు.