టెన్షన్: డేరా ఆశ్రమంలో ఇంకా 30వేలమంది!
సిర్సా: హరియాణలోని సిర్సా పట్టణంలో ఇంకా తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి రాజధాని చండీగఢ్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్సా పట్టణంలో ఉన్న డేరా స్వచ్ఛసౌదా ఆశ్రమంలో 30వేల మంది గుమిగూడి ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వెయ్యి ఎకరాల ఆశ్రమంలో తిష్టవేసిన 30వేలమంది గుర్మీత్ మద్దతుదారులు ఆశ్రమం వీడి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు, సైన్యం ఆశ్రమాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆశ్రమం చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. ఆశ్రమంలోని వారు వెంటనే బయటకు రావాలని సందేశం పంపుతున్నా.. లోపలున్న డేరా మద్దతుదారులు మాత్రం ససేమిరా అంటున్నారు.
15 ఏళ్ల కిందటి లైంగిక దాడి కేసులో డేరా అధిపతి గుర్మీత్ రాంరహీం సింగ్‌ను దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌ను దోషిగా తేల్చడంతో హరియాణలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి తెగబడి.. హింసాకాండను సృష్టించారు. ఈ నేపథ్యంలో రోహతక్‌లోని జైల్లోనే గుర్మీత్‌కు శిక్ష విధిస్తూ సీబీఐ న్యాయమూర్తి ఉత్తర్వులు వెలువరించబోతున్నారు. గుర్మీత్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో రోహతక్‌లో భారీగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. మరోవైపు గుర్మీత్‌కు శిక్ష నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భద్రతా దళాలు హరియాణ అంతటా పహారా కాస్తున్నాయి. ఈ క్రమంలో సిర్సాలోని గుర్మీత్ ఆశ్రమంలో 30వేలమంది పొంచి ఉండటం భద్రతా దళాలకు సవాలుగా మారింది.