లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికారం పీఠం ఎవరిది? కాంగ్రెస్తో జట్టు కట్టిన అధికార సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ గెలుస్తుందా? లేక బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఓటర్లు కరుణ చూపుతారా? టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీ అధికారంలోకి వస్తుందట. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే నిర్వహించింది.
యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మెజార్టీ సీట్లు సాధిస్తుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో తేలింది. యూపీ శాసనసభలో 403 సీట్లు ఉండగా, బీజేపీ 202 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 19 శాతం ఓట్లు అధికంగా వస్తాయని సర్వేలో తేలింది. కాగా అధికార ఎస్పీకి పరాజయం తప్పదని, ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 147 సీట్లు వస్తాయని పేర్కొంది. దీంతో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రతిపక్షంలో కూర్చోకతప్పదని అంచనా వేసింది. ఇక బీఎస్పీ కేవలం 47 సీట్లతో మూడో స్థానానికి పరిమితమవుతుందని సర్వేలో తేలింది.