దుర్గామాత విగ్రహాన్ని ప్రధాని మోదీకి అందజేస్తున్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్
భారత్‌లో ప్రాజెక్టులకు రూ.7,300 కోట్లు
♦ సాగు, రైల్వేల్లో సహకారం
♦ జర్మనీతో 18 ఒప్పందాలు
♦ మోదీ-మెర్కెల్ మధ్య ద్వైపాక్షిక చర్చలు
♦ మహిషాసుర మర్దిని విగ్రహం భారత్‌కు అప్పగింత
న్యూఢిల్లీ: భారత్‌తో వ్యాపార బంధం బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలకమైన ముందడుగు వేసింది. ప్రధానంగా సౌర ఇంధన రంగంలో పెద్ద ఎత్తున భారత్‌కు సహకరించటానికి జర్మనీ ముందుకొచ్చింది. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో 18 ఒప్పందాలు కుదుర్చుకోవటంతో పాటు.. వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారంపై అవగాహనకు వచ్చారు. 28 మంది ప్రతినిధులతో భారత్‌కు వచ్చిన మెర్కెల్ బృందం మోదీ నేతృత్వంలోని భారత బృందంతో పలు అంశాలపై చర్చలు జరిపింది. రక్షణ, భద్రత, నిఘా, రైల్వేలు, పెట్టుబడులు, స్వచ్ఛ ఇంధనం వంటి వివిధ కీలకమైన రంగాలపై ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ‘‘భారత ఆర్థిక పునర్వికాసంలో జర్మనీ సహజ భాగస్వామిగా ఉంటుంది. మా దృష్టి ప్రధానంగా ఆర్థిక సంబంధాలపై ఉన్నా.. ఇరు దేశాలూ సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని నిర్ణయించాం’’ అని చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టే జర్మనీ కంపెనీలకు వేగంగా అనుమతులివ్వటంతో పాటు, సౌర ఇంధన నిధికి వచ్చే ఐదేళ్లలో రూ. 7,300 కోట్ల ఆర్థిక సహాయాన్ని జర్మనీ ప్రకటించింది. అయితే నేర వ్యవహారాల్లో పరస్పర సహకారానికి భారత నేర శిక్షాస్మృతిలోని ఉరిశిక్ష ప్రధాన అడ్డంకిగా మారింది. ఇరు దేశాల మధ్య నేర వ్యవహారాల్లో పరస్పర న్యాయ సహాయ ఒప్పందంపై 2007 నుంచి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం జరిగిన చర్చల్లోనూ భారత్‌లో ఉరిశిక్ష అమల్లో ఉండటం వల్ల ఒప్పందం కుదరలేదు.
పర్యటనలోని మరికొన్ని ముఖ్యాంశాలు
స ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోదీ మెర్కెల్‌కు సంప్రదాయ స్వాగతం పలికారు. భారత సైనిక వందనాన్ని మెర్కెల్ స్వీకరించారు.
స మహాత్మాగాంధీ సమాధి వద్ద మెర్కెల్ నివాళులు అర్పించారు.
స ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో 18 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
స వంకాయ, పొట్లకాయ, కాకరకాయ, ఆల్ఫాన్సో మామిడిపై యురోపియన్ యూనియన్ నిషేధం ఎత్తివేతకు సాయం చేయాలని జర్మనీని భారత్ కోరింది.
స వ్యవసాయంలో అభివృద్ధికి భారత వ్యవసాయ నైపుణ్య మండలితో జర్మనీ వ్యవసాయ వ్యాపార కూటమి సహకారం.
స భారత్‌లో సౌర ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి రూ. 7,300 కోట్ల జర్మనీ ఆర్థిక సాయం
స వాతావరణ మార్పునకు సంబంధించి పారిస్ ఒప్పందంలోని ముఖ్యభాగాన్ని అమలు చేసేందుకు జర్మనీ నిర్ణయం. 2020 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హరిత పరిజ్ఞానం, పరిశుభ్రమైన వాతావరణం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు రూ. 6 వేల కోట్ల ఆర్థిక సాయం.
స భారత్‌లో జర్మన్ భాషకు, జర్మనీలో.., సంస్కృతంతో సహా భారత ఆధునిక భాషలకు విదేశీ భాషలుగా ప్రాచుర్యం కల్పించాలని ఒప్పందం.
స ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని కలసి కట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయం.
స {పపంచంలో అణ్వస్త్ర నిరోధక చర్యలను పటిష్టం చేసే ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయం.
స కశ్మీర్‌లో దొంగతనం జరిగిన 10వ శతాబ్దం నాటి మహిషాసుర మర్దిని విగ్రహం భారత్‌కు అప్పగింత.
స దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు పెరగటంపై ఆందోళన.
స జర్మన్ కంపెనీల కోసం ఫాస్ట్‌ట్రాక్ సిస్టమ్ 2016 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం.
స పెట్టుబడుల ఆకర్షణకు మార్కెట్ ద్వారాలు తెరిచిపెట్టాలని నిర్ణయం.
స స్మార్ట్ సిటీలు, గంగ శుద్ధి కార్యక్రమాలకు జర్మనీ సాయం.
స ఆహార భద్రత, పౌరవిమానయానం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, రైల్వేలు వంటి రంగాల్లో పరస్పర సహకారం.