
బీజేపీ అగ్రనేతపై పోలీసు అధికారి దావా
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియాపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు పరువు నష్టం దావా వేశారు.
కోల్ కతా: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియాపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు పరువు నష్టం దావా వేశారు. తనపై కైలాశ్ నిరాధార, అసత్య ఆరోపణలు చేశారనే కారణంతో కోల్ కతా నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులను కాపాడేందుకు రాజీవ్ కుమార్ ప్రయత్నించారని జనవరి 4న కైలాశ్ ఆరోపణలు చేశారు. ఈ కేసులో కీలక పత్రాలను కమిషనర్ నాశనం చేశారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కోల్‌కతా నగర సెషన్స్ కోర్టులో కైలాశ్ పై రాజీవ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ సుభ్ర ఘోష్.. మార్చి 7న తమ ఎదుట హాజరు కావాలని కైలాశ్ విజయ్ వార్గియాను ఆదేశించారు.