టోర్నడో ధాటికి అమెరికాలో 9 మంది మృతి
అమెరికాలో టోర్నడో విరుచుకుపడటంతో తొమ్మిది మంది మరణించారు. ఒక్క ఆర్కాన్సాస్ రాష్ట్రంలోనే 8 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ బీబ్ ప్రతినిధి మాట్ డీకాంపిల్ తెలిపారు. ఓక్లహామాలో కూడా టోర్నడో రావడంతో ఒక వ్యక్తి మరణించారు. ఆర్కాన్సాస్లోని లిటిల్ రాక్ ప్రాంతంలో వచ్చిన టోర్నడో చాలాసేపు అక్కడే ఉండిపోయింది. తర్వాత ఈశాన్యంగా దాదాపు 48 కిలోమీటర్లు పయనించింది. దీని ప్రభావంతో భవనాలు, వాహనాలు బాగా దారుణంగా దెబ్బతిన్నాయి. నెబ్రాస్కా, లోవా, మిస్సోరి ప్రాంతాలను కూడా టోర్నడో తాకింది. పశ్చిమాన న్యూ మెక్సికో, తూర్పున టెన్నెస్సీ లాంటి రాష్ట్రాలపై దీని ప్రభావం అంతగా ఉండబోదని అధికారులు అంటున్నారు.
కాన్సాస్, మిస్సోరి, మిస్సిసిప్పి, నెబ్రస్కా, లోవా, టెక్సాస్, లూసియానా ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఓక్లహామాలో సుమారు 900 మంది వరకు ఉండే క్వాపా అనే ప్రాంతం దారుణంగా దెబ్బతిందని అక్కడి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డైరెక్టర్ జో డాన్ మోర్గాన్ తెలిపారు. టోర్నడో సంబంధిత గాయాలతో ఆరుగురికి తాము చికిత్స అందించినట్లు బాప్టిస్ట్ రీజనల్ హెల్త్ సెంటర్ తెలిపింది.