మా నాన్నను చెత్త నటుడంటావా!
1970 దశకంలో బాలీవుడ్‌ను ఏలిన దిగ్గజ నటుల్లో రాజేశ్ ఖన్నా ఒకరు. ఆరాధన (1969), హాథీ మేరే సాథీ (1971), ఆనంద్ (1971) వంటి సినిమాలతో గొప్ప నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న నటుడు ఆయన. ఖన్నా గురించి బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా తాజాగా విస్మయపరిచే విమర్శలు చేశారు. ఆయనో మామూలు నాసిరకం నటుడని, ఆయన నటన కూడా చాలా పరిమితంగా ఉంటుందంటూ విమర్శించాడు. మేధోపరంగా ఆయన గొప్ప వ్యక్తేమీ కాదని, ఆయనకు బొత్తిగా అభిరుచి కూడా లేదని, ఆయన వల్ల 70వ దశకంలో సగటు సినిమాలే వచ్చాయంటూ షా చెప్పుకొచ్చాడు.
సాధారణంగానే సోషల్ మీడియాలో తన గళాన్ని గట్టిగా వినిపించే రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.. ఈ విషయంలో ఘాటుగా స్పందించింది. షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన ట్వింకిల్.. ‘మీరు బతికున్న వారిని గౌరవించకున్నా పర్వాలేదు.. కానీ, చనిపోయినవారికైనా గౌరవమివ్వండి. బదులు ఇవ్వలేని వ్యక్తి గురించి విమర్శలు చేయడం నిజమైన సంకుచితత్వం’ అని బదులిచ్చింది.