‘నోట్ల రద్దుతో పాకిస్థాన్ కు షాక్’
విశాఖపట్నం: మనదేశంలో పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాకిస్థాన్ కు షాక్ తగిలిందని పీఎంఓ, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పాకిస్థాన్ లో రెండు కరెన్సీ ముద్రణ సంస్థలు మూత పడ్డాయని వెల్లడించారు. డిమోనిటైజేషన్ తో సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో ఈ-గవర్నెన్స్ రెండు రోజుల జాతీయ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్ లో తీవ్రవాద సంబంధిత హింసాకార్యకలాపాలు 60 వరకు తగ్గాయని తెలిపారు. హవాలా కార్యకలాపాలు సగానికి పడిపోయాయని చెప్పారు. కశ్మీర్ లో హింసను ప్రేరేపించడానికి.. తీవ్రవాద కార్యకలాపాలకు, ఈశాన్య ప్రాంతంలో అలజడులు రేపడానికి నకిలీ నోట్లు, హవాలా డబ్బు వినియోగిస్తున్నారని ఆరోపించారు. డిమోనిటైజేషన్ తో ఇటువంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడి హింసాత్మక చర్యలు తగ్గాయని వివరించారు.
‘పాకిస్థాన్ లో మన కరెన్సీని అక్రమంగా ముద్రిస్తున్న రెండు ముద్రణ సంస్థలు డిమోనిటైజేషన్ తో మూతపడినట్టు మా ప్రభుత్వానికి సమాచారం అందింది. పాత నోట్లను రద్దు చేయడంతో రెండు నెలల్లోనే మంచి ఫలితాలు వచ్చాయ’ని జితేంద్ర సింగ్ అన్నారు.