
బయటకొచ్చిన మరో రెండు వీడియోలు
జమ్మూ కశ్మీర్‌లో సైన్యానికి వ్యతిరేకంగా మరో రెండు వివాదాస్పద వీడియోలు బయటకొచ్చాయి.
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో సైన్యానికి వ్యతిరేకంగా మరో రెండు వివాదాస్పద వీడియోలు బయటకొచ్చాయి. కశ్మీర్ యువకులను సైనికులు కొడుతూ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయించిన వీడియోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రెండు వీడియోల్లోని ఒక దానిలో పుల్వామా డిగ్రీ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని నలుగురు సైనికులు పట్టుకుని నేలపై పడుకోబెట్టి బెత్తంతో కొడుతుండడం కనిపిస్తుంది.
ఇక రెండో వీడియోలో ముగ్గురు యువకులను ఓ ఆర్మీ జీప్‌లో ఎక్కించి ‘పాకిస్తాన్ ముర్దాబాద్’అంటూ వారిచేత బలవంతంగా నినాదాలు చేయించిన దృశ్యాలు కనిపిస్తాయి. ‘మీకు స్వాతంత్య్రం కావాలా?’ అంటూ జవాన్ ముగ్గురిలో ఓ యువకుడిని కొట్టడంతో నుదిటి నుంచి రక్తం కారుతుంటుంది.
శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి గత ఆదివారం ఉప ఎన్నిక జరిగిన సమయంలో జవాన్లపై ఆందోళనకారులు దాడి చేసిన వీడియో.. ఓ వ్యక్తిని ఆర్మీ జీపుకు ముందువైపు కట్టివేసిన వీడియో.. ఓ ఆందోళనకారుడిని ఆర్మీ సిబ్బంది దగ్గరినుంచే తుపాకీతో కాల్చి చంపిన వీడియో..ఈ మూడు వివాదాస్పద వీడియోలు గతంలో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి రాడం తెలిసిందే. వీటిపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇప్పటికే నివేదిక కోరారు. అటు ఆర్మీ కూడా అంతర్గత విచారణ జరుపుతోంది.