2010లో వారణాసి బాంబుపేలుళ్ల ఘటనపై కరడుకట్టిన తీవ్రవాది యాసిన్ భత్కల్ను ప్రశ్నించేందుకు తమ రాష్ట్రానికి చెందిన తీవ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) ఒకటి గత అర్థరాత్రి న్యూఢిల్లీ పయనమైయ్యందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఐజీపీ (శాంతి భద్రతలు) ఆర్.కే.విశ్వకర్మ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. 2010 సెప్టెంబర్ 7వ తేదీన వారణాసిలో శీతల్ ఘాట్ వద్ద వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో ముగ్గురు మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆ దుశ్చర్య తమ పనే అని ఇండియన్ ముజాహిద్దీన్ ప్రకటించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే ఆ ఘటనలో భత్కల్ పాత్రకు సంబంధించి ఏటువంటి ఆధారాలు లభించలేదని విశ్వకర్మ పేర్కొన్నారు. అయినా అతడికి ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలిసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
భత్కల్ను యూపీ తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. గురువారం భారత్- నేపాల్ సరిహద్దుల్లో భత్కల్తోపాటు నిఘావర్గాలకు చిక్కిన అసదుల్లా స్వస్థలం అజాంగఢ్లోని బాజ్ బహదుర్ ప్రాంతమని ఆయన తెలిపారు. అయితే అతనిపై స్థానికంగా ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.