చేతులు కాలాక ఆకులు పట్టుకున్న అమెరికా
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న అమెరికా
Published Fri, Dec 30 2016 10:51 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
హనోలులు: ఎన్నికల ప్రచారంలో హ్యాకింగ్ కు పాల్పడిన రష్యాపై గురువారం అమెరికా చర్యలు తీసుకుంది. రష్యా స్పై ఏజెన్సీలు, 35 మంది డిప్లొమాట్స్ పై కొరడా ఝుళిపించింది. రష్యా చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తుందని అమెరికా పేర్కొనగా.. ఒబామా దద్దమ్మ పాలన చేస్తున్నారని తమ డిప్లొమాట్స్ ను తొలగించడంపై ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా పేర్కొంది.
దీంతో ఇరు దేశాల అంతర్జాతీయ రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఎన్నికల్లో ట్రంప్ అనుకూలంగా రష్యా ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు పనిచేశాయని ఒబామా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చిన తర్వాత ఒబామా తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. రష్యా వాడిన సైబర్ ట్రిక్కుల గురించి మరింతగా వివరించాలని ఐదు ఫెడరల్ ఏజెన్సీలను ఒబామా ప్రభుత్వం కోరింది. ఇప్పటికీ అమెరికాపై కుట్రపూరిత దాడికి పాల్పడేందుకు రష్యా చూస్తోందని ఒబామా పేర్కొన్నారు.
అలాంటి దాడులకు కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు. ఇక్కడితో ఈ విషయం ముగిసిపోదని చెప్పిన ఒబామా.. అమెరికా రష్యాపై ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నారు. కాగా, అమెరికాలోని రష్యా ఎంబసీలో పని చేస్తున్న వారిని విధుల్లో నుంచి తొలగించిన యూఎస్.. వీరు రష్యా ఇంటిలిజెన్స్ కు చెందిన వారని ఒబామా చెప్పారు. న్యూయార్క్, మేరిల్యాండ్ లలోని రష్యా కార్యాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. రష్యాలోని అమెరికా ఎంబసీలోని అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
అమెరికా ఎన్నికల ప్రచారంలో తమ జోక్యం ఉందనే ఆరోపణలను రష్యా ఖండించింది. అమెరికా ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించింది. సైబర్ అటాక్స్ పై ఒబామా నాయకత్వంలో అమెరికా తీసుకున్న బలమైన నిర్ణయం ఇదే. గత ఏడాది సోని పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ను హ్యక్ చేసిన ఉత్తర కొరియాపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది.
Advertisement