
‘గండి’ కొట్టారు!
జంట నగరాలకు తాగునీరందించే గండిపేట జలాశయానికి అధికారులు, ప్రజాప్రతినిధులు గండి కొడుతున్నారు...
- ఉస్మాన్‌సాగర్ బఫర్ జోన్‌ను మింగుతున్న అక్రమార్కులు
సాక్షి, హైదరాబాద్: జంట నగరాలకు తాగునీరందించే గండిపేట జలాశయానికి అధికారులు, ప్రజాప్రతినిధులు గండి కొడుతున్నారు. జలాశయాన్ని సంరక్షించాల్సిన వారే కాసుల కోసం బఫర్‌జోన్‌ను మింగేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విల్లాల నిర్మాణం సాగుతున్నా అధికార యంత్రాంగం దృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తోంది. ఉస్మాన్‌సాగర్(గండిపేట) జలాశయానికి ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్‌టీఎల్) 30 మీటర్లు కాగా.. రివర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఆర్‌ఎఫ్‌టీఎల్) 500 మీటర్లుగా ఉంది. పట్టా భూములున్న ఆర్‌ఎఫ్‌టీఎల్ ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా వ్యవహరిస్తారు. నిబంధనల ప్రకారం ఈ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలను అనుమతించరు.
కానీ ఉస్మాన్‌సాగర్ డౌన్ స్ట్రీమ్‌లోని సర్వే నం.390 (పార్టు), 19, 20, 28, 29, 30లలో సుమారు 24 ఎకరాల్లో ‘విల్లాల’ నిర్మాణం సాగుతోంది. మంచిరేవుల, గండిపేట గ్రామాల పరిధిలోని ఈ భూముల్లో గ్రూపు హౌసింగ్ పేరుతో హెచ్‌ఎండీఏ నుంచి నాలుగెకరాలకు పర్మిషన్ తీసుకొన్న ఎన్.కె.కన్‌స్ట్రక్షన్స్ సంస్థ.. ఏకంగా 24 ఎకరాల విస్తీర్ణంలో విల్లాల నిర్మాణాలు సాగిస్తోంది. వీటికి స్థానిక గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకొన్నట్లు ఆ సంస్థ వాదిస్తోంది. గ్రూపు హౌసింగ్‌కు విధిగా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఆ నియమాన్ని పాటించకుండా.. 400 చదరపు గజాలు, 800చదరపు గజాల విస్తీర్ణంలో సుమారు 96 విల్లాలను నిర్మించింది.
విశాలమైన రోడ్లు, సకల సదుపాయాలతో నిర్మించిన 400 చ.గ. విల్లా రూ.1.5 - 2.5 కోట్లు, 800 చ.గ. విల్లా రూ.2.5- 3.5 కోట్ల చొప్పున విక్రయించినట్లు సమాచారం. వీటిని కొనుగోలు చేసిన వారిలో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. రెండు మూడేళ్ల నుంచి ఇక్కడ అడ్డగోలుగా విల్లాల నిర్మా ణం సాగుతున్నా అడ్డుకోవాల్సిన పంచాయతీ గానీ, హెచ్‌ఎండీఏ గానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
హెచ్‌ఎండీఏకూ పాత్ర
ఉస్మాన్‌సాగర్ బఫర్‌జోన్‌ను సంరక్షించాల్సిన హెచ్‌ఎండీఏ.. అక్రమార్కులకు అండగా నిలుస్తోందన్న ఆరోపణలున్నాయి. మూడేళ్లుగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నా వాటిని అడ్డుకోవాల్సింది గ్రామ పంచాయతీయేనని చెప్పుకొస్తోంది. కానీ బఫర్‌జోన్‌లోని ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరిస్తోంది. ఏకమొత్తంగా ఎకరాల కొద్ది భూమిని క్రమబద్ధీకరిస్తే వ్యవహారం బయటపడుతుందని నాలుగైదు వేల గజాల చొప్పున ప్లాట్లుగా క్రమబద్ధీకరిస్తూ నిర్మాణ సంస్థకు సహకరించినట్లు హెచ్‌ఎండీఏలోని రికార్డులు సూచిస్తున్నాయి. హెచ్‌ఎండీఏలోని కొందరు అధికారులు దీనంతటినీ చక్కబెట్టారని, అక్రమాలు బయటపడకుండా కొన్ని ఫైళ్లను మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజాప్రతినిధుల ఆవాసం..
కొందరు ప్రజాప్రతినిధులు సైతం జంట జలాశయాల ఎఫ్‌టీఎల్ పరిధిలో గెస్ట్‌హౌస్‌లు నిర్మించుకోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా మార్చుకొన్నారు. ఒక మంత్రికి హిమాయత్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో గెస్ట్‌హౌస్ ఉండగా, మాజీ మంత్రి ఒకరు ఉస్మాన్‌సాగర్ బఫర్‌జోన్‌లోని 17 ఎకరాల్లో తోటలు, గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేసుకొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సదరు నాయకుడు ఎల్‌ఆర్‌ఎస్ కింద ఈ భూమిని క్రమబద్ధీకరించుకొన్నట్లు సమాచారం. ఉస్మాన్‌సాగర్ బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరిపించి నివేదిక తెప్పించుకొన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల్లో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకూ పాత్ర ఉన్నందున చర్యలు ఉంటాయా.. లేదా అనేది ప్రశ్నార్థకమే!