ఆ అక్రమాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
Published Tue, Feb 7 2017 5:45 PM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM
పర్యావరణానికి, ఆరోగ్యానికి, భద్రతలకు పెనుముప్పుగా మారుతున్న ఇసుక మైనింగ్ అక్రమాలపై కేంద్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇసుక మైనింగ్ అక్రమ తరలింపు, దానివల్ల తలెత్తుతున్న పరిణామాలను విజయసాయిరెడ్డి రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే ఏళ్లలో నిర్మాణ రంగం 157 బిలియన్ డాలర్ల(రూ. 10,58,556కోట్ల)కు ఎగుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఇసుకకు, ఇతర ఖనిజాలకు భారీగా డిమాండ్ ఏర్పడి అక్రమాలు విపరీతంగా చోటుచేసుకునే ప్రమాదముందని హెచ్చరించారు.
ఇసుక మైనింగ్ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో అక్రమ మైనింగ్ భారీగా ప్రబలుతుందని తెలిపారు. రోజుకు 2000 ట్రక్కుల ఇసుక అక్రమంగా హైదరాబాద్కు తరలివెళ్తుందన్నారు. విచక్షణారహితంగా ఇసుకను వెలికితీయడం పర్యావరణ, ఆర్థిక, సామాజిక ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని చెప్పారు. భూముల సారవంతం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. వరదల ముప్పు కూడా అత్యధికంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement