
అమ్మ మీద ప్రేమతో.. చిన్నమ్మను..!
చెన్నై: తన తల్లిని వదిలేసి తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. ఆ మహిళపై కత్తితో దాడి చేయటంతోపాటు ఆమె కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సెయ్తుంగనల్లూర్ సమీపంలో ఉన్న నాట్టూరుకుళం గ్రామానికి చెందిన చెల్లపాండి(50) కేరళ రాష్ట్రంలో హోటల్ నడుపుతున్నాడు. ఇతని భార్య వండి మలైచ్చి. వీరి కుమారుడు వండి మలైయాన్(21). అయితే భార్యతో విభేదాలు తలెత్తటంతో కొన్నేళ్లుగా వేరుగా ఉంటున్నాడు.
దీంతోపాటు వల్లనాడు సమీపం పాలైకాడు గ్రామానికి చెందిన రాజేశ్వరిని(38) రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి నందిని అనే నెలన్నర పాప ఉంది. ఇటీవలే భార్య, కూతురును చూసేందుకు పారైక్కాడ్కు వచ్చిన చెల్లపాండి మంగళవారం ఉదయం కేరళకు వెళ్లాడు. తన తండ్రి రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి వండిమలైయాన్ ఆగ్రహాంతో ఉన్నాడు. మధ్యాహ్నం రాజేశ్వరి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు.
నిద్రపోతున్న పసికందు నందినిని ఎత్తి నేలకు కొట్టడంతో చనిపోయింది. అయినా ఆవేశం తీరక వెంట తెచ్చుకున్న కత్తితో రాజేశ్వరిని పొడిచాడు. ఆమె అరుపులకు ఇరుగుపొరుగు వారు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపుమడుగులో ఉన్న రాజేశ్వరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో మురప్పనాడు పోలీసులు మలైయాన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.