వృద్ధురాలి పాత్రలో హీరోయిన్
విజయదశమి... బాణం... దగ్గరగా దూరంగా తదితర టాలీవుడ్ చిత్రాలలో నటించిన కన్నడ భామ వేదిక ఇప్పుడు కొత్త తరహ పాత్రలో నటించబోతుంది. అది కూడా పాఠశాల విద్యార్థితోపాటు 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో వేదిక ఒదిగిపోనుంది. ప్రముఖ నటుడు ప్రభుదేవ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే విక్టర్ జయ్రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్లో మొదలుకానుందని ఆ చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది. ఈ చిత్రంలో వేదిక పాత్ర ప్రత్యేకత సంతరించుకుంటుందని తెలిపింది. అయితే వేదికను వృద్ధురాలి పాత్రలో చూపించేందుకు ఏ ప్రముఖ మేకప్ ఆరిస్ట్ వద్దకు వెళ్లడం లేదని పేర్కొంది.
ఆ పాత్ర కోసం ఇప్పటికే వేదికకు మేకప్ వేసి పరీక్షించామని చెప్పింది. ఆ మేకప్లో ఆమె పాత్రకు సరిపోయారని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో విభిన్న పాత్రల్లో నటించేందుకు ఇప్పటికే వేదిక పలు వర్క్షాపుల్లో పాల్గొంటుంది. తమిళనటుడు వరణ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని వేదిక ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.