దారుణం: ఆపరేషన్ థియేటర్‌లో వైద్యుల నిర్వాకం
సాక్షి, రాజస్థాన్: మనిషి ప్రాణాలు కాపాడే వైద్యుడిని దేవుడితో పోలుస్తారు. కానీ అలాంటి వైద్యులే తమ విద్యుక్త ధర్మాన్ని మరిచిపోయి.. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లోనే గొడవపడితే.. ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణీని ఆపరేషన్ బెడ్ మీద పడుకోబెట్టి.. తమలో తాము కుస్తీపట్లకు దిగితే.. ఈ దారుణమే రాజస్థాన్ జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
ఓ నిండూ గర్భిణీ కడుపునొప్పితో జోధ్‌పూర్ ఉమైద్ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్న సమయంలో డెలివరీని ఆపి ఇద్దరు వైద్యులు ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లోనే గొడవపడ్డారు. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. ఇలా వైద్యులు నిర్లక్ష్యం వహించడంతో బాధిత మహిళ ప్రసవించిన పసికందు మృతిచెందింది. దీంతో ఆస్పత్రి తీరుపై, వైద్యుల నిర్లక్ష్యంపై బాధిత మహిళ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం (29వ తేదీ) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన నేపథ్యంలో గొడవకు దిగిన ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించినట్టు ఉమైద్ ఆస్పత్రి సూపరింటిండెంట్ ఆల్ భట్ తెలిపారు. ఇద్దరు వైద్యులపై త్వరలోనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కడుపులోనొప్పితో, లో హార్ట్‌బీట్‌తో మహిళ ఆస్పత్రిలో చేరిందని, అయినా నవజాత శిశువు మృతిపై దర్యాప్తు జరుపుతామన్నారు.