సాయంత్రం 6.15 నిమిషాల నుంచి బార్ లో తప్పతాగి అర్ధరాత్రి 12.30 గంటలకు హోటల్ బయటకు వచ్చిన ముగ్గురు యువకులు కారు డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరినట్లు చూపుతున్న సీసీటీవీ వీడియో కారు యాక్సిడెంట్ కేసులో ముగ్గరి ప్రాణాలు బలిగొన్న ఎమ్మెల్యే కొడుకు మెడకు ఉచ్చుబిగుసుకునేలా చేస్తోంది.
ఈ నెల 2వ తేదీన సికర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నందకిశోర్ తనయుడు సిద్దార్ధ మహారియా తన స్నేహితులతో కలిసి తాగిన మత్తులో కారును వేగంగా నడుపుతూ ఓ ఆటో రిక్షాను ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. జైపూర్ లో బార్ అండ్ రెస్టారెంట్లలో సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన అధికారులకు సిద్దార్ధ స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు కనిపిస్తున్న ఫుటేజీలు వారికి దొరికాయి.
తాగి 100 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపిన సిద్దార్ధ ఆటోను ఢీ కొట్టడంతో అది ఒక్కసారిగా దాదాపు 200 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అక్కడితో ఆగని అతని కారు పార్కింగ్ చేసి ఉన్న పోలీసుకారును కూడా ఢీ కొట్టడంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. సిద్దార్ధను అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్రిత్ ఎనలైజేర్ తో పరీక్షించగా సాధారణ మోతాదు కంటే ఐదు రెట్లు అధికంగా మద్యం సేవించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
యాక్సిడెంట్ జరిగిన సమయంలో వర్షం కురుస్తోందని, ఆ సమయంలో అక్కడ లైట్లు కూడా లేవని, ఇంతలో ఓ ఆటో వేగంగా కారువైపుకు దూసుకురావడం వల్లే యాక్సిడెంట్ జరిగినట్లు సిద్దార్ధ చెప్పారు. కారుకు ఎయిర్ బ్యాగ్స్ సౌకర్యం ఉండటం వల్ల తమ ప్రాణాలు మిగిలాయని అన్నారు. కాగా, ఈ కేసులో సిద్దార్ధ తరఫు వాదించేందుకు నందకిశోర్ ప్రముఖ అడ్వకేట్ ను సంప్రదించారు.
తాగి ముగ్గురి ప్రాణాలు తీసిన ఎమ్మెల్యే కొడుకు
Published Fri, Jul 8 2016 11:51 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
Advertisement
Advertisement