అట్టుడికిన నాగాలాండ్.. రంగంలోకి ఆర్మీ
కోహిమా: మున్సిపల్ ఎన్నికల వ్యవహారం ప్రభుత్వానికి, నాగా గిరిజనులకు తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారడంతో నాగాలండ్ అల్లర్లతో అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ సన్నిహితుల ఇళ్లతోపాటు పలు ప్రభుత్వ భవనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితితి చేయిదాటుతున్న తరుణంలో ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ప్రభుత్వ అధాకారులు చెప్పిన వివరాల ప్రకారం..
నాగారలాండ్‌లోని 32 మున్సిపాలిటీల ఎన్నికలకు గత నెలలో నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కేటాయించింది. దీనిని మెజారిటీ నాగా గిరిజనులు వ్యతిరేకించారు. మహిళలకు కోటా ఇవ్వడం తమ ఆచార,సంప్రదాయాలకు విరుద్ధమని నాగాలు నిరసనలకు దిగారు. రాజ్యాంగంలోని 371(ఎ) అధికరణ తమకు ఆ(మహిళా కోటాను వ్యతిరేకించే హక్కును) కల్పిస్తున్నదని నాగాల వాదన. దీంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఒక దశలో ఎన్నికల వాయిదాకు సరేనన్న జెలియాంగ్ సర్కారు.. చివరికి ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపడంతో నాగాలు ఆగ్రహంతో ఊగిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1న 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలమంది నాగా గిరిజనులు రోడ్లెక్కారు. ఈ క్రమంలోనే పోలీసులకు, నాగాలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నాగా యువకులు చనిపోయారు.
చనిపోయిన యువకుల మృతదేహాలతో భారీ ర్యాలీ తీసిన నాగాలు.. గురువారం సాయంత్రం నుంచి రాజధాని కోహిమా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను దిగ్భంధించారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయాలని, కాల్పులు జరిపిన పోలీసులను డిస్మిస్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాత్రికి ఆందోళన కాస్తా హింసాత్మకంగా మారింది. కోహిమా మున్సిపాలిటీ కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి సన్నిహితుల ఇళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం అర్థరాత్రి తర్వాత సైన్యం రంగంలోకి దిగింది. ఐదు శ్రేణుల సైనిక బృందాలు కోహిమాను స్వాధీనం చేసుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం నాగాలాండ్‌లో అల్లర్లేవీ కొనసాగడంలేదని అసోం రైఫిల్స్ అధికార ప్రతినిధి మీడియాకు చెప్పారు. అల్లర్లు వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రమంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ఎంతమంది చనిపోయింది, గాయపడింది తెలియాల్సిఉంది.