ప్రతిపాదిత అత్యాధునిక సీమ్‌లెస్ ట్యూబ్ మిల్ ప్రాజెక్టు ఏర్పాటుకై మరో భాగస్వామి వేటలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(ఆర్‌ఐఎన్‌ఎల్-విశాఖ ఉక్కు) నిమగ్నమైంది. వైజాగ్ ప్లాంటులో రానున్న రూ.2 వే ల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో చేతులు కలిపేందుకు బీహెచ్‌ఈఎల్ నిరాసక్తత వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: ప్రతిపాదిత అత్యాధునిక సీమ్‌లెస్ ట్యూబ్ మిల్ ప్రాజెక్టు ఏర్పాటుకై మరో భాగస్వామి వేటలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(ఆర్‌ఐఎన్‌ఎల్-విశాఖ ఉక్కు) నిమగ్నమైంది. వైజాగ్ ప్లాంటులో రానున్న రూ.2 వే ల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో చేతులు కలిపేందుకు బీహెచ్‌ఈఎల్ నిరాసక్తత వ్యక్తం చేసింది. దీంతో బీహెచ్‌ఈఎల్ స్థానంలో జేవీ భాగస్వామిగా ఉండాలంటూ ఎన్‌ఎండీసీని తాజాగా విశాఖ ఉక్కు కోరింది. మాంగనీస్ ఓర్ ఇండియా ఇప్పటికే ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది.
మిల్లు స్థాపన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు విశాఖ ఉక్కు, ఎన్‌ఎండీసీ, మాంగనీస్ ఓర్ ఇండియాలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఉక్కు మంత్రిత్వ శాఖను కోరినట్టు ఆర్‌ఐఎన్‌ఎల్ ఫైనాన్స్ డెరైక్టర్ పి.మధుసూదన్ తెలిపారు. ఏ సంస్థకు ఎంత వాటా ఉండాలో సమావేశంలో నిర్ణయం కానుంది. అయితే వైజాగ్ స్టీలు ప్లాంటులో సీమ్‌లెస్ ట్యూబ్ మిల్లు ఏర్పాటు కానున్నందున ఆర్‌ఐఎన్‌ఎల్ మెజారిటీ వాటా తీసుకునే అవకాశం ఉంది.