
11 ఏళ్ల ప్రపంచ మేధావి వైశాలిని
మనతోటి వయసు ఉన్న వారు వయసుకు మించి ఏ రంగంలో అయినా అద్భుతాలు సృష్టిస్తే తెలుసుకోవడం అవసరం.
సాక్షి : మనతోటి వయసు ఉన్న వారు వయసుకు మించి ఏ రంగంలో అయినా అద్భుతాలు సృష్టిస్తే తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే దాని నుంచి మనం కూడా ప్రేరణ పొందేందుకు అది ఉపయోగపడుతుంది. దీనితో పాటు వారు ఆ స్థాయికి చేరడానికి చేసిన కృషి తెలుసుకుంటే, మనం ఇంకా ఎంత కష్టపడాలో మనకీ ఒక అవగాహన ఏర్పడుతుంది. అందుకే ఇక నుంచి ‘వార్తల్లో వండర్ కిడ్’లో భాగంగా వివిధ రంగాల్లో వయసుకు మించి రాణిస్తున్న చిన్నారుల గురించి తెలుసుకుందాం..
అది 2011. ఆ అమ్మాయి పేరు కె.వైశాలిని. వయసు 11 ఏళ్లు. అందరి లాంటి అమ్మాయి అయితే ఆరో తరగతి చదువుతూ..తనతోటి పిల్లలతో ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడుపుతూ ఉండేది. తను కూడా ఇవన్నీ చేసింది. కానీ అందిరి కంటే భిన్నంగా తన వయసుకి మించి వైశాలిని ప్రదర్శించిన తెలివితేటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేశాయి. ప్రపంచంలోనే అత్యంత ఐక్యూ (తెలివితేటలను కొలవడానికి ప్రమాణాలు) ఉన్న చిన్నారిగా తమిళనాడులోని తిరుణవేలికి చెందిన వైశాలిని రికార్డు సృష్టించింది.
ఆమె ఐక్యూ (ఇంటిలిజెన్స్ కోయిషెంట్) 225. వైశాలిని రోజుకి మూడు గంటల పాటు కంప్యూటర్ ముందే కాలక్షేపం చేస్తుందట. ఈ సమయాన్ని అతిక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు వినియోగించుకుంటుంది. తనకున్న అద్భుతమైన తెలివితేటలతో ఎనలేని విజ్ఞానాన్ని ఆర్జించింది. బీఈ, బీటెక్ విద్యార్థులకు కూడా క్లాసులు చెప్పడం వెశాలిని మేధాశక్తికి నిదర్శనం. అదే ఏడాది కర్ణాటక (మంగుళూరు)లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక’ నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌కు ఈ చిన్నారి ముఖ్య అతిథిగా హాజరయ్యింది.