భూకంపాలను ముందుగా గుర్తించలేమా?
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోవున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పెను భూకంప ప్రమాదాలను ఎందుకు ముందుగా గుర్తించలేక పోతున్నాం? ఎందుకు అపార ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించలేకపోతున్నాం? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజమే. ఓ పక్క శాస్త్రవిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే గుర్తించవచ్చని అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాల ద్వారా రుజువు చేస్తున్నా అందుకు తగిన వ్యవస్థ ఎందుకు మనకు అందుబాటులోకి రావడం లేదన్న ప్రశ్న కూడా సహజమే. భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఓ దేశానికో, ఓ ప్రాంతానికో పరిమితం కాదు. వీటిపై పరిశోధనలు మాత్రం ఓ దేశానికో, ప్రాంతానికో పరిమితమవుతున్నాయి. అందుకని పరిశోధనల ఫలాలు అందుబాటులోకి రావడం లేదు. ఇలాంటి వైపరీత్యాలను నివారించేందుకు అంతర్జాతీయ సమన్వయం, కృషి అత్యవసరం.
మొన్నటికి మొన్న బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ పెను భూకంపాల ముప్పును వారం, పది రోజుల ముందే అంచనా వేయవచ్చని తేల్చారు. పెను భూకంపాలు రావడానికి 23 రోజుల ముందుగానే బొరియల్లో నివసించే జంతువులు, క్షీరదాలు, పక్షుల ప్రవర్తనలో మార్పులు వస్తాయని, 15 రోజుల నుంచి వారం రోజుల ముందు వాటి ప్రవర్తనలో మార్పులు తీవ్రంగా ఉంటాయని, ఆ మార్పులను గుర్తించడం ద్వారా భూకంపాల ముప్పును ముందుగానే గుర్తించవచ్చని ఆయన తేల్చారు. పెరూలో 2011లో సంభవించిన పెను భూకంపంపై పరిశోధనలు చేసిన ఆయన.. పెరూలోని యనచాగ జాతీయ పార్కులో ఏర్పాటు చేసిన రికార్డింగ్ సౌకర్యం కలిగిన కెమేరాలను తెప్పించికొని పరిశీలించారు. ఆ కెమేరాల ఫుటేజ్ ద్వారా పక్షుల్లో, జంతుజాలం ప్రవర్తనలో వచ్చిన మార్పులను లోతుగా అధ్యయనం చేశారు. భూకంపానికి 23 రోజుల ముందుగా వాటి ప్రవర్తనలో స్వల్పంగా మార్పులు వచ్చాయని, ఆ తర్వాత, వారం, పది రోజుల ముందు ప్రళయం రాబోతున్నట్టు అవి అడవిలో కల్లోలం సృష్టించాయని, ఇక రెండు, మూడు రోజుల్లో ముప్పు ముంచుకురాబోతున్న తరుణంలో భయంతో కదలక, మెదలక స్తబ్దుగా కనిపించాయని ఆయన వివరించారు.
వాటిలో వచ్చిన ఈ విపరీత మార్పులను ఆయన శాస్త్రీయంగా విడమర్చి చెప్పారు కూడా. భూకంపానికి ముందు భూ పొరల్లో ఏర్పడే కదిలికల వల్ల భూ ఉపరితలంపైనా, భూ వాతావరణంలోని గాలిలో అయాన్ల చలనం ఏర్పడుతుందని, దీనివల్ల పశుపక్షాదుల రక్తంలో సెరటోన్ల స్థాయి హఠాత్తుగా పెరుగుతుందని, ఆ కారణంగా అవి విచిత్రంగా, భయాందోళనలతో ప్రవర్తిస్తాయని ఆయన వివరించారు. రక్తంలో సెరటోన్ల స్థాయి పెరిగితే ముఖ్యంగా బొరియల్లో నివసించే జంతువులు, క్షీరదాలు, పక్షుల్లో తెలియని గుబులు, తీవ్ర అలసట, మానసిక ఆందోళన తలెత్తుతాయని, అందుకని విచిత్రంగా ప్రవర్తిస్తాయని చెప్పారు. వాతావరణంలోని అయాన్ల చలనానికి మానవుల శరీరాలు పెద్దగా స్పందించవని అన్నారు. జంతువుల ప్రవర్తనను గమనించడం ద్వారా ఒకరకంగా ముందే భూకంపాల ముప్పును మానవులు గ్రహించవచ్చన్నారు. భూగర్భంలో ప్రకపనలను ముందుగానే గుర్తించే పరికరాలను అమర్చడం ద్వారా కూడా భూకంపం ముప్పును ముందే గుర్తించవచ్చని మరి కొందరు శాస్త్రవేత్తలు ఇదివరకే నిరూపించారు.
- సాక్షి వెబ్ సైట్ ప్రత్యేకం