
ఉల్లికి బీహార్ ఎన్నికలకు లింకేమిటి?
పాట్నా: ఇటీవల మార్కెట్లను రెండు పరిణామాలు కుదిపేశాయి. ఉల్లి ధర ఊహించని విధంగా రాకెట్‌లాగా ఆకాశంలోకి దూసుకెళ్లగా, ఆకాశం నుంచి నేలకు దూసుకొచ్చిన రాకెట్‌లా స్టాక్ మార్కెట్ ఢమాల్‌న కూలింది. ఉల్లిపైనైనా పెట్టుబడులు పెట్టకపోతిమంటూ స్టాక్ ఇన్వెస్టర్లు లబోదిబోమంటూ విలపించారు కూడా. ఈ రెండు పరిణామాలకు కారణాలు వేర్వేరు. ఒకదానికొకటి సంబంధం లేదు. అలాగే కారణాలు వేరైనా, కాకతాళీయమేనైనా బీహార్ ఎన్నికలు సమీపించినప్పుడల్లా మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ విషయాన్ని గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌లో జరిగాయి. ఈ సారి కూడా అక్టోబర్ చివరి వారంలోగానీ, నవంబర్ మొదటి వారంలోగానీ జరిగే అవకాశం ఉంది. 2005లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉల్లి ధరలు భగ్గుమన్నాయి. జాతీయంగా ఉల్లి ధరలు సరాసరి 240 శాతం పెరగ్గా, పాట్నా మార్కెట్‌లో 230 శాతం పెరిగాయి. అలాగే 2010లో బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జాతీయంగా ఉల్లి ధరలు సరాసరి 155 శాతం పెరగ్గా, పాట్నా మార్కెట్‌లో 177 శాతం పెరిగాయి. 2005కు ముందు జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఉల్లి ధరలు పెరిగే ఉంటాయి. లెక్కలు తేల్చేందుకు గణాంకాలు అందుబాటులో లేవు.
మార్కెట్‌లో ఉల్లి జాతీయ సగటు ధర జనవరిలో క్వింటాల్‌కు 1,325 రూపాయలుండగా, నేడు అది 3,300 రూపాయలకు చేరుకుంది. అంటే... దాదాపు 150 శాతం పెరిగింది. నేషనల్ హార్టికల్చర్ బోర్డు లెక్కల ప్రకారం ఏటా భారతీయులు కోటిన్నర టన్నుల ఉల్లిని వినియోగిస్తారు. ఈ సారీ ఉల్లి ఉత్పత్తి గణనీయంగా తగ్గడంగానీ, పంట నాశనంగానీ అంతగా జరుగలేదు. రెండు అంశాలను పరిగణలోకి తీసుకున్నా జాతీయంగా మార్కెట్ వినియోగం కన్నా తగ్గిందీ కేవలం నాలుగు లక్షల టన్నులు మాత్రమే.
అంతమాత్రానికి ఉల్లి ధర ఏకంగా 150 శాతం పెరగాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు పెరిగిందనే ప్రశ్న రావచ్చు. పెద్ద మార్కెట్ శక్తులు కుమ్మక్కవడం, మధ్యస్థాయి మార్కెట్ శక్తులను ఉల్లి కొనుగోలుకు అనుమతించకుండా బడా వ్యాపారస్థులు అడ్డుపడడమే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ బడా మార్కెట్ శక్తులను నియంత్రించేందుకు ప్రభుత్వపరంగా మార్కెట్ శాఖలు ఎక్కడికక్కడ ఉన్నా అవి మార్కెట్ మాయాజాలంలో డబ్బుకు దాసోహం అవుతున్నాయి.