సేనను నిషేధించడం వెనుక ఉద్దేశమేంటి?
పనాజి: వివాదస్పద హిందూ సంస్థ శ్రీరామసేనను గోవాలో నిషేధించడాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తప్పుబట్టారు. డ్రగ్ లార్డ్స్, పబ్ మాఫియా ఆదేశాల మేరకు తమ సంస్థను నిషేధించారని ఆయన ఆరోపించారు. గోవాలో శ్రీరామసేనను నిషేధించడం వెనుక ఉద్దేశమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అసలు శ్రీరామసేన లేదని, ఒక్క సభ్యుడు ఇందులో లేరని ఆయన వెల్లడించారు.
గోవాలో తాము ఏమైనా దాడులు చేశామా అని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను రాష్ట్రంలోకి అనుమతిస్తూ, దేశభక్తులపై నిషేధం విధిస్తారా అని నిలదీశారు. నిషేధం ఎత్తివేత కోసం కోర్టును ఆశ్రయిస్తామని ముతాలిక్ చెప్పారు. శ్రీరామసేనను నిషేధిస్తున్నట్టు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ శాసనసభలో బుధవారం ప్రకటన చేశారు.