భారత్ కు దీటుగా పాక్ అణ్వాయుధాలు
పాకిస్తాన్ పెద్ద ఎత్తున అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పటికే దాదాపు 130 నుంచి 140 వార్ హెడ్ లను పాక్ తయారుచేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా జారీచేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఎఫ్-16 ఫైటర్ల ద్వారా న్యూక్లియర్ వార్ హెడ్ లను, మిరాజ్ ఫైటర్ల ద్వారా రాడ్ ఎయిర్ లాంచ్ క్రూస్ మిస్సైల్ ను మోసుకెళ్లే సామర్ధ్యాలను జోడించిందని తెలిపారు.
గూగుల్ మ్యాప్స్ ద్వారా పది పాకిస్తానీ న్యూక్లియర్ బేస్ లను పరిశీలించిన అమెరికా శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కరాచీకి పశ్చిమంగా ఉన్న మస్రూర్ ఎయిర్ బేస్ లో ఎఫ్-16 జెట్లకు అణు వార్ హెడ్ లను మోసుకెళ్లే శక్తి సామర్ధ్యాలను పెంపొందిస్తున్నారని చెప్పారు. అమెరికన్ శాస్త్రవేత్తలు పరిశీలించిన పది బేస్ లలో ఐదు గ్యారిసన్లు(సైనిక స్ధావరాలు), రెండు ఎయిర్ బేస్ లు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు.
ఎయిర్ బేస్ లలో అణ్వాయుధాల తయారీతో పాటు ఫైటర్ జెట్లకు వాటిని మోసుకెళ్లే సామర్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు. ఎఫ్ఏఎస్ కు చెందిన హన్స్ ఎమ్ క్రిస్టెన్సన్ మాట్లాడుతూ.. అక్రో(సింధ్), గుజ్రన్ వాలా(పంజాబ్), ఖుజ్దర్(బలూచిస్తాన్), పనో అక్విల్(సింధ్), సర్గోధాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలను తయారుచేస్తుందని చెప్పారు. బహవాల్పూర్ లో గల ఆరో బేస్ ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నట్లు పేర్కొన్నారు. దెరా ఘాజి ఖాన్ లో గల బేస్ ఉన్న నిర్మాణతీరు చూస్తుంటే అది న్యూక్లియర్ బేస్ కాదనే అనుమానాలు రేకత్తుతున్నట్లు చెప్పారు.
ఈ బేస్ లలో గల అణ్వాయుధాలను ఉపయోగించి 100 కిలోమీటర్ల లోపల గల టార్గెట్లను పాకిస్తాన్ ఛేదించగలదని తెలిపారు. పాకిస్తాన్ వినియోగిస్తున్న టెక్నాలజీ మొత్తం చైనాకు చెందినదేనని పేర్కొన్నారు. పశ్చిమ ఇస్లామాబాద్ లో గల పాకిస్తానీ నేషనల్ డెవలప్ మెంట్ కాంప్లెక్స్ లో షాహీన్-2, బాబర్ మిస్సైల్స్ ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ క్రమంగా భారత్ కు దీటుగా ఆయుధాలను తయారుచేసుకుంటుందని తెలిపారు.