పెట్టుబడులు పెట్టేవారికి ఆర్థిక అవగాహన ముఖ్యం
హర్షేందు బిందాల్
పెట్టుబడుల విషయానికొస్తే మనలో చాలా మంది ఒకే మూస పద్ధతిని అనుసరిస్తుంటారు. అయితే ఒకరికి అనువైన సాధనం మరొకరికి అనువైనది కాకపోవచ్చన్నది విస్మరిస్తుంటారు. సాధారణంగా బంగారం, రియల్ ఎస్టేట్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టల్ పొదుపు ఖాతాల వంటి సాధనాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటిలో బంగారం, రియల్టీ మినహా మిగతావాటిని ఎప్పటికప్పుడు ప్రాతిపదికన తీసుకుంటారే తప్ప... దీర్ఘకాలిక అవసరాల దృష్టితో చూడరు. ఒక రకంగా చెప్పాలంటే నిర్దిష్ట లక్ష్యాలకు తగినట్లుగా పెట్టుబడులు పెట్టే వారు చాలా తక్కువ. ఫలితంగా తీరా కీలక అవసరానికన్నా ముందే మనం పొదుపు చేసిన లేదా పెట్టుబడి పెట్టిన మొత్తాలను వాడేసేయడం జరుగుతుంటుంది. ఆర్థిక అంశాలపై అవగాహన అంతగా లేకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి వాటి వల్లే అధిక రాబడులిస్తామని ఆశ చూపే పోంజీ స్కీముల్లో చిక్కుకుని దాచుకున్నదంతా సమర్పించేసుకోవడం జరుగుతోంది. అలా కాకుండా ఉండాలంటే ఆర్థికంపై అవగాహన ఒకటే మార్గం. దీన్నే మనం ఆర్థిక అక్షరాస్యతగా కూడా చెప్పుకోవచ్చు.
సాధారణంగా ఈక్విటీ మార్కెట్లలో రిస్కుం టుందని, అవి అర్థం కానివని చాలామంది భావిస్తుంటారు. అయితే, నిపుణుల సారథ్యంలో నడిచే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే 5-10-15-20 ఏళ్ల పాటు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడం వల్ల రిస్కులు కూడా తగ్గించుకోవచ్చు. ఇక, పెట్టుబడులు పెట్టిన తర్వాత రాబడులపై పన్నులపరమైన ప్రయోజనాలూ చూసుకోవాల్సి ఉంటుంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలపై వచ్చే రాబ డుల మీద ఏటా పన్నులు ఉంటుండగా.. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మాత్రం రిడెంప్షన్ వేళ మాత్రమే పన్నులు ఉంటాయి. అలాగే, ఏడాది పైగా పెట్టుబడి కొనసాగిస్తే ఈక్విటీ ఫండ్‌ల రాబడులపై పన్ను పడదు. అలాగే, డెట్ ఫండ్స్ విషయానికొస్తే రాబడులు ద్రవ్యోల్బణాన్ని మిం చితేనే పన్ను భారం పడుతుంది. మరోవైపు బీమా సంగతి తీసుకుంటే అసలు లక్ష్యాన్ని విస్మరించి.. ప్రీమియం వెనక్కి తిరిగి రాదనే కారణంతో టర్మ్ ఇన్సూరెన్స్‌ను పక్కన పెట్టి ఇతర పథకాల వైపు వెళుతుంటారు.
కానీ అంతే ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా అధిక కవరేజి పొందవచ్చని తెలుసుకోవాలి. బీమా అనేది ఏదైనా అనుకోనిది జరిగితే ఆర్థికంగా నష్టపోకుండా కాపాడే ఆర్థిక సాధనంగానే చూడాలే తప్ప పెట్టుబడి సాధనంగా చూడకూడదు. ఇలాంటివన్నీ కూడా ఆర్థిక అంశాలపై పరిజ్ఞానం ఉంటేనే తెలుస్తాయి. పెట్టుబడులకు సంబంధించి లక్ష్యాలు, రిస్కులు మొదలైన వాటిపై అవగాహన ఏర్పడుతుంది. అలాగే పిల్లల చదువు/ వారి పెళ్లి, తమ రిటైర్మెంట్ వంటి లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవడం సాధ్యపడుతుంది.