'నువ్వు భారత్ ఎందుకు వెళ్లావు?'
ఇస్లామాబాద్: భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధులపై ఆ దేశ ప్రభుత్వం కన్నెర్ర జేసింది. భారత పర్యటనకు ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వాలని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ ను కోరింది. షహర్యార్ ఖాన్ నేతృత్వంలో పీసీబీ బృందం రెండు వారాల కిందట ముంబైలోని బీసీసీఐ ప్రధాన్య కార్యాలయంలో చర్చలు జరపుతుండగానే.. దాని ఎదురుగా శివసేన పాకిస్థాన్ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించింది. దీంతో వారి పర్యటన అర్ధంతరంగా ముగిసింది.
ఈ నేపథ్యంలో పీసీబీ ప్రతినిధులపై పర్యటనపై పాకిస్థాన్ క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మియన్ రియజ్ హుస్సేన్ పిర్జాదా తీవ్రంగా స్పందించారు. భారత పర్యటనకు పీసీబీ బృందం ప్రభుత్వ అనుమతి తీసుకుందా? లేదా? వివరణ ఇవ్వాలని కోరుతూ ఆయన నోటీసులు జారీచేశారని డాన్ పత్రిక తెలిపింది. భారత్-పాకిస్థాన్ మధ్య మళ్లీ క్రికెట్ సిరీస్ లను పునరుద్ధరించే విషయమై చర్చలు జరిపేందుకు పీసీబీ ఈ పర్యటన చేపట్టింది.