భారత్-పాక్ టెస్టు సిరీస్ ఇంగ్లండ్‌లో!
కరాచీ: ఎంతకాలంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌కు సంబంధించి మరో తటస్థ వేదిక తెరపైకి వచ్చింది. దాయాదుల సిరీస్‌లో భాగంగా వచ్చేనెల శ్రీలంకలో పరిమిత ఓవర్ మ్యాచులు (వన్డేలు, టీ-20లు), వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో టెస్టులు జరిగే అవకాశముందని తెలుస్తున్నది. ఈ మేరకు ఇటీవల దుబాయ్‌లో జరిగిన బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వచ్చేనెల శ్రీలంకలో భారత్‌తో పరిమిత ఓవర్ల మ్యాచులు ఆడేందుకు షహర్యార్ ఖాన్ ఇప్పటికే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, విదేశాంగమంత్రిత్వశాఖ అనుమతి కోరారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచులు ఆడేందుకు కూడా భారత్ సమ్మతించిందని షహర్యార్ ఖాన్ సంకేతాలు ఇచ్చినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 2017లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫుల్ సిరీస్ ఆడేందుకు భారత్ రానున్నదని, అంతకుముందు రెండు దఫాలుగా ఇరుజట్ల మధ్య మ్యాచులు జరుగనున్నాయని, ఈ మేరకు షెడ్యూల్ ప్రణాళిక సిద్ధమైందని ఆ వర్గాలు తెలిపాయి.
వచ్చే ఏడాది వేసవిలో ఇంగ్లండ్‌లో భారత్-పాక్ టెస్టు సిరీస్ జరిగే అవకాశముందని చెప్పాయి. గత వారాంతంలో దుబాయ్‌లో శశాంక్ మనోహర్, షహర్యార్ ఖాన్ మధ్య జరిగిన సమావేశంలో మధ్యవర్తిగా పాల్గొన్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు గైల్స్ క్లార్క్.. తటస్థ వేదికగా ఇంగ్లండ్ ను కూడా ప్రతిపాదించారని తెలుస్తున్నది.