15 నుంచి దాయాదుల క్రికెట్ పోరు!
న్యూఢిల్లీ: సర్వత్రా ఆసక్తి రేపుతున్న ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ వచ్చేనెల 15 నుంచి శ్రీలంకలో ప్రారంభమయ్యే అవకాశముందని బీసీసీఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ క్రికెట్ సిరీస్ కు ఇప్పటికే పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పచ్చజెండా ఊపారు. దీంతో తటస్థ వేదిక అయిన శ్రీలంకలో భారత్, పాకిస్థాన్ జట్లు వన్డేలు, ట్వీ-20లు ఆడనున్నాయి. షరీఫ్ ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో డిసెంబర్ 15 నుంచి సిరీస్ ప్రారంభమయ్యే చాన్స్ ఉందని శుక్లా తెలిపారు.
ఇందుకు భారత ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇరుదేశాల క్రికెట్ బోర్డులు తటస్థ వేదికలో క్రికెట్ ఆడేందుకు అంగీకరించాయని ఆయన చెప్పారు. ఈ తాజా కబురుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే దాయాదుల క్రికెట్ పోరుకు ఇరు జట్లు ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది.
ఇక ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ వచ్చే ఏడాది వేసవిలో ఇంగ్లండ్ లో జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఇంగ్లండ్ లో టెస్టులు నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరించినట్టు సమాచారం. ఆ తర్వాత 2017లో భారత్ లో పర్యటించేందుకు పాకిస్థాన్ జట్టు రానున్నదని భావిస్తున్నారు.