
పతంజలి బెంగ మాకు లేదు
రామ్ దేవ్ బాబా పతంజలి అమ్మకాల వృద్ధితో ఇతర ఎఫ్ఎమ్ సీజీ ప్లేయర్లు ఆందోళన చెందుతోంటే.. పరాగ్ మిల్క్ కంపెనీ మాత్రం ధీమాగా ఉంది. ముఖ్యంగా పతంజలి మిల్క్ ఉత్పత్తుల వల్ల తమకు అంతా మంచే జరుగుతుందని పరాగ్ మిల్క్ ఫుడ్స్ చెబుతోంది. మార్కెట్లో దూసుకుపోతున్న పతంజలి నుంచి తమకు ఎలాంటి ముప్పు ఉండదనీ , పైపెచ్చు తమ బిజినెస్ పెరగడానికి పతంజలి ఉత్పత్తులు దోహదం చేస్తున్నాయని పేర్కొంది. పుణేకు చెందిన విభిన్నమైన డెయిరీ ఉత్పత్తుల ఈ కంపెనీ, గోవర్థన్ బ్రాండ్ లో ఆవు పాలతో తయారుచేసిన నెయ్యిని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు లూజ్ అన్ బ్రాండెడ్, సమ్మిళిత నెయ్యి నుంచి ఆవు పాల నెయ్యి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఇది పతంజలితో పాటు తమకు ఎంతో సహకరిస్తుందని పరాగ్ మిల్క్ ఫుడ్స్ సీఎఫ్ఓ భరత్ కేడియా తెలిపారు.
గేదె పాల నెయ్యి కంటే ఆవు పాల నెయ్యికి సాధారణంగా ప్రీమియం లభ్యమవుతుంటోంది. ధరల విషయంలో పతంజలి సంస్థ తమకు పోటీగా రావట్లేదని, కొన్నిసార్లు ఆ కంపెనీ ప్రొడక్ట్ లు తమ ధరలతో సమానంగా లేదా ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. పతంజలి కంటే తక్కువ ధరలకే తమ ఆవు పాల నెయ్యి మార్కెట్లో లభ్యమవుతుందని కేడియా తెలిపారు. కంపెనీ సీఏజీఆర్(కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు) రెవెన్యూ వృద్ధి కూడా గడిచిన ఐదేళ్లలో 17 శాతం నమోదైందని చెప్పారు. అంతకముందు ఈ వృద్ధి 12-13 శాతంగా ఉంది. శుక్రవారం విడుదలైన జనవరి-మార్చి త్రైమాసిక రెవెన్యూ ఫలితాల్లో 20 శాతం వృద్ధిని తాము నమోదు చేశామని, ఆపరేటింగ్ మార్జిన్లను 120 బేసిక్ పాయింట్లను పెంచుకుని 9.7శాతంగా నమోదుచేసినట్టు కంపెనీ పేర్కొంది.