అమెరికా ప్రయోజనాలను, అమెరికన్ల ఉద్యోగాలను పణంగా పెట్టి ఇతర దేశాల ఆర్థికవృద్ధికి గత పాలకులు దోహదపడ్డారని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిశ్చితాభిప్రాయం. ఇతర దేశాలకు రక్షణ కల్పిస్తూ... అమెరికా సరిహద్దులను పట్టించుకోలేదంటారు. ‘అమెరికా ఫస్ట్... మన ఉద్యోగాలు మనకే, మన వస్తువులనే కొందాం’ అంటూ బాధ్యతలు స్వీకరించాక తొలి ప్రసంగంలో చెప్పిన ట్రంప్... ఆచరణలోనూ వేగంగా కదులుతున్నారు. 12 దేశాల ట్రాన్స్ పసిఫిక్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (నాఫ్టా)ను పునసమీక్షించడంపై ఆదేశాలు జారీచేయడం జరిగిపోయింది. పైగా గ్రూపులు, ప్రాంతీయ ప్రాతిపదికన కాకుండా ఒక్కోదేశంతో వ్యాపార, వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికే ట్రంప్ మొగ్గుచూపుతున్నారు. కేవలం దైప్వాక్షిక సంబంధాలపైనే దృష్టి పెడుతున్న ట్రంప్ విధానం భారత్‌పై ఏ విధమైన ప్రభావం చూపుతుంది? ట్రంప్ చైనా వ్యతిరేకత భారత్‌కు లాభిస్తుందా? మరి హెచ్1బీ వీసాల సంగతేంటి? అనేవి ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు.
ఉగ్రవాదంపై భారత్-అమెరికా పోరు
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ట్రంప్ భారత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ‘దక్షిణ, మధ్య ఆసియాలో భద్రత గురించి ఇరువురులు నేతలు మాట్లాడుకున్నారు. రక్షణ, ఆర్థిక రంగాల్లో మైత్రిని బలోపేతం చేయడం, పలు ఇతర రంగాల్లో సహకారాన్ని అందించుకోవడం... తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భారత్‌ను సిసలైన మిత్రుడిగా, భాగస్వామిని అమెరికా పరిగణిస్తుందని ట్రంప్ నొక్కి చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో అమెరికా– భారత్ కలిసి నడవాలని ట్రంప్– మోదీలు తీర్మానించారు’ అని వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ ఏడాది అమెరికాకు రావాల్సిందిగా మోదీని ట్రంప్ ఆహ్వానించారు కూడా.
చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ చర్యలు
కీలక మిత్రదేశాలైన బ్రిటన్, జపాన్, జర్మనీ దేశాల నాయకులు, బలీయశక్తులుగా ఉన్న రష్యా, చైనా నాయకులతో ఇంకా మాట్లాడని ట్రంప్... వీరందరికంటే ముందు మోదీకి ఫోన్ చేయడం భారత్‌తో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. ట్రంప్ రష్యాను ప్రథమ శత్రువుగా పరిగణించడం లేదు... చైనా మూలంగా ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయని, ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని ప్రచారం దశ నుంచే గట్టి డ్రాగన్ వ్యతిరేక వైఖరిని ఆయన కనబరుస్తున్నారు. ఈ చైనా వ్యతిరేకత భారత్ పట్ల ట్రంప్‌లో సానుకూల వైఖరిని పెంచుతోంది. పైగా భారత మార్కెట్‌ను కూడా అమెరికా విస్మరించలేదు. చైనాకు చెక్ పెట్టడానికి, ప్రాంతీయ సమతుల్యతను పాటించడానికి భారత్‌తో దోస్తీ అమెరికాకు అవసరమే.
'మేక్ ఇన్ ఇండియా - మేక్ ఇన్ అమెరికా'తో లబ్ధి
మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’, ట్రంప్ ’మేన్ ఇన్ అమెరికా’ నినాదంతో ఇరుదేశాలు పరస్పరం లబ్ధి పొందవచ్చని రిపబ్లికన్ హిందూ కోయలిషన్‌కు చెందిన శలభ్ కుమార్ విశ్లేషణ. రక్షణ, ఇంధన, సాంకేతిక రంగాల్లో భారత్‌కు అమెరికా తమ ఎగుమతులను పెంచేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. చైనాతో వాణిజ్య బంధానికి అమెరికా దూరం జరిగే కొద్దీ... ఆ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకొని అమెరికాకు తమ ఎగుమతులను పెంచవచ్చనేది ఆయన అభిప్రాయం. ఇలా ట్రంప్, మోదీలు ఇద్దరూ తమ ప్రాధామ్యాలను వదులుకోకుండానే పరస్పరం ఇరుదేశాలు లబ్ది పొందవచ్చని ఆయన వాదన.
హెచ్1బీ వీసాలపై కఠిన వైఖరి ఎందుకు?
అయితే ట్రంప్ వలస విధానం ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి గట్టి ప్రతిబంధకంగా నిలవొచ్చు. హెచ్1బీ వీసాలపై ట్రంప్ కఠిన వైఖరి... భారత ఐటీ కంపెనీలకు మింగుడుపడటం లేదు. భారత ఐటీ సంస్థలకు వచ్చే ఆదాయం ఎక్కువగా అమెరికా నుంచే వస్తోంది. లక్ష డాలర్లు, అంతకంటే ఎక్కువ వార్షిక వేతనాన్ని అందుకే నిపుణులకు మాత్రమే హెచ్1బీ వీసా మంజూరు చేయాలనే బిల్లు ప్రస్తుతం అమెరికా చట్టసభల ముందుంది. హెచ్1బీ వీసాల దుర్వినియోగం జరుగుతోందని, దీనిద్వారా తక్కువ వేతనాలకే విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకొని... అమెరికన్ల పొట్టగొడుతున్నారనేది ట్రంప్ వాదన. అమెరికన్లకు ఉద్యోగాల కల్పన అత్యంత ప్రాధాన్యాంశంగా ఎన్నికల ప్రచారంలో చెప్పిన ట్రంప్ ఇదే కఠన వైఖరిని కొనసాగిస్తే భారత్‌కు ఇబ్బందే. ఎందుకంటే హెచ్1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే పొందుతున్నారు. వీటి ద్వారా ఉద్యోగులను అమెరికాకు పంపి భారతీయ ఐటీ కంపెనీలు అక్కడ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. దీనికి ట్రంప్– మోదీలు ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్