భారీగా ఉద్యోగులపై వేటువేస్తున్నవిప్రో
న్యూఢిల్లీ: దేశంలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో కూడా ఉద్యోగులపై భారీగా వేటు వేయనుంది. వార్షిక "పనితీరు అంచనా" లో భాగంగా వందల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. సుమారు 600 మంది ని ఇంటికి పంపించనుంది. అయితే ఈ సంఖ్యంగా మరింత పెరిగనుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సంఖ్య 2వేలమంది కంటే ఎక్కువే ఉండొచ్చని సమాచారం.
అయితే దీనిపై స్పందించిన విప్రో రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఈ తొలగింపులని పేర్కొంది. తన క్లయింట్ రిక్వైర్‌మెంట్స్, సంస్థ వ్యూహాత్మక ప్రాధాన్యతలను బట్టి ఉద్యోగులను క్రమబద్ధీకరించే క్రమంలో "కఠినమైన పనితీరును అంచనా వేసే ప్రక్రియ" నిర్వహిస్తామని తెలిపింది. ఈసమగ్రమైన పనితీరు అంచనా ప్రక్రియలో ఉద్యోగుల మార్గదర్శకత్వం, పునః శిక్షణ, అప్ స్కిల్లింగ్ కూడా ఉంటుందని చెప్పింది. అలాగే సంస్థ నుంచి కొందరు ఉద్యోగులపై వేటుకు దారితీయవచ్చని ఈ సంఖ్య సంవత్సర సంవత్సరానికి మారుతూ ఉంటుందని తెలిపింది. అయితే ఎంతమందిని తొలగించిందీ స్పష్టం చేయలేదు.
కాగా డిసెంబరు 2016 చివరి నాటికి, బెంగళూరుకు చెందిన కంపెనీకి 1.79 లక్షల ఉద్యోగులు ఉన్నారు. ఏప్రిల్ 25 న నాలుగవ త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించనుంది.