దూసుకుపోతున్న రెడ్ మి అమ్మకాలు
స్మార్ట్ ఫోన్ల వ్యాపారాల్లో ఇటు చైనా తర్వాతే ఏ కంపెనీలైనా.. ఇటు నాణ్యతకు నాణ్యత.. అటు ధరకు ధర, అమ్మకాలకు అమ్మకాలు. ఇదే జోష్ తో ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ షియోమి అందంగా ఆకట్టుకునే విధంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రెడ్ మి ఫోన్లు అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయట. ప్రతి నాలుగు సెకన్లకు 5 రెడ్ మి ఫోన్లు అమ్ముడు పోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. కేవలం చైనాలో మాత్రమే కాక, కంపెనీకి రెండో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ మార్కెట్లో కూడా ఇంతే అమ్మకాలను నమోదుచేస్తున్నట్టు పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా మొదటి రెడ్ మీ ఫోన్ 2013 ఆగస్ట్ లో ఆవిష్కరించారు. అప్పటినుంచి మొత్తం 1100లక్షల రెడ్ మీ ఫోన్లు అమ్ముడు పోయినట్టు షియోమీ గ్లోబల్ ఆపరేషన్ల వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బార ట్వీట్ చేశారు. మూడేళ్లలో ఒక సెకనుకు 1.21 యూనిట్లు అమ్మినట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. అనువైన ధరలతో రెడ్ మి ఫోన్లను షియోమి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రత్యేకతల్లోను ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునే విధంగానే ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఫ్లాష్ సేల్స్ ద్వారానే తన చాలా పోన్లను అమ్మినట్టు షియోమి పేర్కొంది.
షియోమి తాజాగా రెడ్ మీ నోట్ 3 ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ మెమరీ, 3జీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమరీ ఆప్షన్ లో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 2జీ ర్యామ్ ఫోన్ ధర రూ.9,999. 3జీబీ ర్యామ్ ధర రూ.11,999. 1.8జీహెచ్ జడ్ హెక్సా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్, 128 జీబీ విస్తరణ మెమరీ ఈ ఫోన్ ఫీచర్లు.