రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నోట్ సిద్ధం చేసి ప్రక్రియను ముందుకు తీసుకెళుతోందని,
‘సమైక్య తీర్మానం’ కోసం తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని విజ్ఞప్తి
మెజారిటీ ప్రజలు విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..
కేంద్రం కేబినెట్ నోట్‌పై ముందుకెళుతుండటంపై ఆందోళన
పార్టీ ప్రతినిధి బృందంతో కలసి నరసింహన్‌కు వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నోట్ సిద్ధం చేసి ప్రక్రియను ముందుకు తీసుకెళుతోందని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయటానికి తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం పార్టీ ప్రతినిధి బృందంతో కలసి రాజ్‌భవన్‌కు వెళ్లిన జగన్.. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), యూపీఏ భాగస్వామ్య పార్టీలు విభజనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో మెజారిటీ ప్రజలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎం వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. విభజన ప్రక్రియకు సంబంధించిన కేబినెట్ నోట్ రూపకల్పనలో ముందుకు పోతుండటం ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
కోస్తా, రాయలసీమల్లో దాదాపు ప్రజలందరూ 60 రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ఆయనకు తెలియజేశారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసులురెడ్డి, కె.శ్రీనివాసులు, గుర్నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, భూమన కరుణాకర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, అమరనాథరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, సి.నారాయణరెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రహమాన్ తదితరులు జగన్‌మోహన్‌రెడ్డితో పాటు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు.