నివాళులర్పించిన వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, కుటుంబ సభ్యులు
వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి సందర్భంగా శుక్రవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ జనసంద్రమైంది. ఉదయం 8.30 గంటలకు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్, వైఎస్ మనుమడు వైఎస్ రాజారెడ్డి, మనుమరాళ్లు వర్ష, హర్ష, అంజలిలతో కలిసి ఘాట్‌కు చేరుకున్నారు. ఫాదర్ రెవరెండ్ డాక్టర్ నరేష్‌బాబు, రెవరెండ్ బెన్‌హర్, పాస్టర్ మృత్యుంజయరావులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
భౌతికంగా వైఎస్ మన మధ్య లేకపోయినా.. ఎప్పటికీ అందరి హృదయాల్లో నిలిచి ఉంటారని, మహానేత ప్రేమకు ప్రతిరూపమని కుటుంబ సభ్యులందరూ స్మరించుకున్నారు. వైఎస్ ఘాట్‌పై పూల మాలలు ఉంచి, ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు. వైఎస్ సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేష్‌రెడ్డి, వైఎస్ మేనత్త కమలమ్మ, సోదరి విమలమ్మ, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన సతీమణి సమత, ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, ప్రజలు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.