బాబూ.. పోలవరం కల ఎప్పుడు కన్నావ్?
- 2004, 2009లో టీడీపీ మేనిఫెస్టోలో దీన్ని ఎందుకు చేర్చలేదు?
- నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరితే ప్రాజెక్టును అడ్డుకున్నట్టా?
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం మానుకోండి
- వైఎస్సార్‌సీపీ నేతలు కన్నబాబు, కొలుసు పార్థసారథి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కల సాకారం తన జీవితాశయంగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు కు ఆ కల ఎప్పుడు వచ్చిందో చెప్పాలని తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు, కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. మంగళవారం వారు వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. తెలుగు ప్రజల వందేళ్ల కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు టి.అంజయ్య హయాంలో బీజం పడితే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆచరణలోకి వచ్చిన విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. వాటిని పక్కన పెట్టి పోలవరం తన కలగా చెప్పుకుంటున్న బాబు 2004, 2009లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ఎందుకు చేర్చలేదని నిలదీశారు. కేవలం రూ.1,981 కోట్ల ‘నాబార్డు’ రుణం వస్తే దానిని అసాధారణ విజయంగా పేర్కొంటూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నబాబు తీరు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఆ విషయంలో విభజన చట్టంలోనే ఉంది
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనన్న విషయం రాష్ట్ర విభజన చట్టంలోనే స్పష్టంగా ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ఏపీకి అప్పగించాక అంచనా వ్యయం రూ.16,010.45 కోట్ల నుంచి రూ.40,351.65 కోట్లకు పెరిగిందని.. ఈ వ్యత్యాసాన్ని కేంద్రం భరిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకుంటుందా? అనే విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతుంటే ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘అబద్ధాలు చెప్పడం.. మోసం చేయడం.. వాస్తవాలను పక్కదోవ పట్టించడం.. బాబూ! ఇదీ నీ నైజం.ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎగ్గొట్టిన రీతిలోనే పోలవరం విషయంలోనూ మోసం చేస్తున్నావు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సాక్షి పత్రిక నీ మోసాలను.. ఎండగడుతుం డటాన్ని నీవు భరించలేకపో తున్నావు’’ అంటూ ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టు లు.. ప్రధానంగా బహుళార్థక సాధక ప్రాజెక్టు, రాష్ట్ర వరదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు, కమీషన్ల కోసం పాల్పడుతున్న కక్కుర్తి విధానాలపై వారు పలు ప్రశ్నాస్త్రాలను సంధించారు. దమ్ముంటే ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు.