
రాష్ట్రంలో ఆటవిక పాలన: గడికోట
రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, రాజకీయ హత్యలపై టీడీపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, రాజకీయ హత్యలపై టీడీపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. నారాయణరెడ్డి హత్య జరిగి 48 గంటలైనా ఇప్పటివరకు ఒక్క అరెస్టు కూడా జరక్కపోవడం దారుణమన్నారు. ఈ హత్యను కర్నూలు జిల్లా ఎస్పీ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, దోషులను పట్టుకోవడానికి అసలు ప్రయత్నమే చేయడం లేదని మండిపడ్డారు.
మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గడికోట మాట్లాడుతూ సోషల్ మీడియాలో వ్యంగాస్త్రాలు సంధించిన వారిని అరెస్టు చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న టీడీపీ సర్కార్.. రాజకీయ హత్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్Sను పెంచి పోషిస్తున్నది సీఎం చంద్రబాబేనన్నారు. టీడీపీ ముఖ్యుల ప్రమేయం ఉన్నందునే ఈ కేసును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే ఈ కేసులో డీజీపీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.