ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టాక ప్రవేశపెట్టే తొలి రైల్వే బడ్జెట్ పై వైఎస్సార్ సీపీ పలు ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు రైల్వే మంత్రి సదానంద గౌడను కలిసి బడ్జెట్ పై ప్రతిపాదనలు అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ నేతలు.. 'సదానంద గౌడను కలిసి ప్రతిపాదనలు ఇచ్చాం. నడికుడి- శ్రీకాళహస్తి మార్గం అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఇది మూడు నియోజకవర్గాల మీదుగా వెళ్తుంది. చాలా దూరం కలిసి వస్తుంది. ఆర్థికపరంగా చూసుకున్నా ఇది చాలా ఖర్చు తక్కువ అయ్యే ప్రాజెక్టు. వాస్తవానికి దీనికి 2010-11 బడ్జెట్ లోనే ఆమోదం తెలిపారు. వైఎస్ అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సగం ఖర్చు భరిస్తామని చెప్పింది. అయినా ఇంతవరకు దీనిపై ముందడుగు పడలేదు. దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరాం. అలాగే, కడప-బెంగళూరు, గుంటూరు-సికింద్రాబాద్ రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టాలి. మన రాష్ట్రం నుంచి రైల్వే కేబినెట్ మంత్రి ఎవరూ లేరు. బీహార్, బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి మంత్రులు ఉండటంతో వాళ్ల ప్రాంతాలను బాగా అభివృద్ధి చేసుకున్నారు.మనకి చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరాం. సదానందగౌడ, ఎన్డీయే ప్రభుత్వం ఎలా చేస్తుందో చూద్దాం' అని మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుపతి నుంచి షిరిడీకి ఒక రైలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు. ''శ్రీకాళహస్తి-నడికుడి- రాపూరు రైల్వేలైను కావాలి. ఇది బాగా వెనకబడిన ప్రాంతం, బస్సు మార్గాలు కూడా సరిగా లేవు. ఇక్కడంతా పేద ప్రజలే ఉన్నారు. అలాగే పుత్తూరు నుంచి నారాయణవనం, నాగులాపురం రైల్వేలైను కూడా లేదు. ఇక్కడ కూడా రైలు కావాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, తిరుపతి రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ రద్దీ తగ్గాలంటే మరో రైల్వేస్టేషన్ కూడా రావాలి'' అని ఆయన అన్నారు.
భద్రాచలం - కొవ్వూరు మార్గం వస్తోందని 30 ఏళ్లనుంచి చెబుతున్నారు గానీ, ఇంతవరకు ఆ కల సాకారం కాలేదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దాని కోసం ఈ ప్రాంత వాసులంతా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. ఆ కోరిక నెవరేర్చడంతో పాటు ఖమ్మం పట్టణంలో అనేక అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలు కావాలని, కొత్తగూడెం, ఖమ్మం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు.