చేప కన్నుతో చికిత్స!
వాషింగ్టన్: రెటీనా దెబ్బతిని చూపు కోల్పోయిన వారు తిరిగి చూడగలిగేలా చేయగలమని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. జీబ్రా ఫిష్ మెదడులోని రసాయనిక చర్యల కారణంగా అది తన రెటీనాను కేవలం 28 రోజుల్లో పునరుత్పత్తి చేసుకోగలదని వండర్‌బిల్ట్ వర్సిటీ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. చేపలోని న్యూరోట్రాన్స్‌మీటర్ ‘గాబా’ వల్ల ఇది సాధ్యమవుతుందని వారు తేల్చారు.
చేపతో పాటు క్షీరదాల్లో రెటీనాను పునరుత్పత్తి చేయగల శక్తి గాబాకు ఉందని, దీనివల్ల దెబ్బతిన్న రెటీనాను కన్ను తనంతట తానుగా పునరుత్పత్తి చేసుకునే అవకాశం ఉందని ప్రొఫెసర్ జేమ్స్ ప్యాటన్ తెలిపారు. రెటీనాకు గాయమైనప్పుడు అందులోని ముల్లర్‌గ్లియా అనే మూలకణాలు పూర్తిగా వ్యాప్తి చెంది దెబ్బతిన్న నాడీకణాలను పునరుద్ధరిస్తాయి. ఈ మూలకణాలు క్షీరదాల్లోనూ ఉన్నప్పటికీ వాటికి పునరుత్పత్తి శక్తి ఉండదని జేమ్స్ తెలిపారు. ఈ పరిశోధనా వివరాలు ‘స్టెమ్ సెల్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.