ఆరుషి జంట హత్యల కేసులో దోషులుగా తేలిన ఆమె తల్లిదండ్రులకు యావజ్జీవ శిక్ష పడింది. న్యాయస్థానం మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు వారికి శిక్ష ఖరారు చేసింది. అయిదున్నరేళ్లుగా సాగిన ఈ కేసు విచారణపై సోమవారం తుది తీర్పు వెల్లడించిన ఘజియాబాద్ సీబీఐ కోర్టు... ఆరుషి తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్‌లను దోషులుగా తేల్చింది. రాజేష్ దంపతులే ఆరుషితో పాటు పనిమనిషి హేమరాజ్‌ను దారుణంగా హత్య చేశారని పేర్కొంది.
దోషులుగా తేలిన రాజేష్ దంపతులకు మరణశిక్ష విధించాలని సీబీఐ వాదించింది. ఇది అత్యంత అరుదైన కేసుగా పేర్కొన్న సీబీఐ... దోషులకు మరణశిక్షే సరైందని వాదనలు వినిపించింది. అయితే శిక్ష తగ్గించాలని తల్వార్ దంపతుల తరుపు న్యాయవాది అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు దోషులకు యావజ్జీవ శిక్ష విధించింది. కోర్టు తీర్పు విన్న ఆరుషి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. కాగా తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు నూపూర్ తల్వార్ దంపతులు సిద్ధం అవుతున్నారు.
కాగా పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో శిక్షల ఖరారుపై నేడు కూడా వాదనలు జరిగాయి. నోయిడాలోని వారి ఇంట్లో 2008 మే 15 రాత్రి జరిగిన ఈ జంట హత్యలకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడానికి సంబంధించి కూడా అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్‌లాల్ వారిని దోషులుగా పేర్కొన్నారు.
దర్యాప్తు సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగిన ఈ కేసులో ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు సోమవారం తీర్పు వెలువడింది. హత్యలపై నోయిడా పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఐపీసీ సెక్షన్ 203 కింద ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. సంచలనం కలిగించిన ఆరుషి, హేమరాజ్‌ల హత్య కేసులో తీర్పు వెలువడనున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆరుషి తల్లిదండ్రులకు యావజ్జీవ శిక్ష
Published Tue, Nov 26 2013 4:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement