బురిడీ బాబా మోసాలు చేసేది ఇలా | Police Explained Details of 'Life style' Scams | Sakshi
Sakshi News home page

బురిడీ బాబా మోసాలు చేసేది ఇలా

Published Wed, Jun 22 2016 7:41 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Police Explained Details of 'Life style' Scams

- పూజ చేస్తే కరెన్సీ ఎగురుకుంటూ వస్తుందని టోకరా
- కస్టడీకి వస్తే లోతుగా విచారించడానికి సన్నాహాలు

సాక్షి, సిటీబ్యూరో

 బంజారాహిల్స్‌లో నివసించే ‘లైఫ్‌స్టైల్’ యజమాని మధుసూదన్‌రెడ్డి కుటుంబాన్ని రూ.1.33 కోట్ల టోకరా వేసిన దొంగ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద స్వామి బురిడీ కొట్టించడానికి ‘బారిష్’ మంత్రం వేస్తుంటాడని పోలీసులు చెప్తున్నారు. దీని ద్వారానే డబ్బు రెట్టింపు, కొన్ని రెట్లు అవుతుందంటూ నమ్మబలుకుతాడు.

 

గత శుక్రవారం ఇతడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు బయటపెట్టాడని అధికారులు తెలిపారు. కేవలం శివే కాదు... పూజల పేరుతో టోకరా వేసే అనేక మంది దొంగ బాబాలు బాధితులపై బారిష్ మంత్రాన్నే ప్రయోగిస్తుంటారు. బారిష్ అంటే వర్షం అని అర్థం. తాంత్రిక పూజ చేయడం ద్వారా డబ్బు వర్షంలా వస్తుందని, చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, బ్యాంకు లాకర్ల నుంచే ఈ మొత్తం ఎగురుకుంటూ వస్తుందని నమ్మిస్తుంటారు.

ఈ పూజ సఫలీకృతం కావాలంటే 21 గోళ్లు ఉన్న తాబేలు (సాధారణంగా తాబేలుకు 18 గోళ్లే ఉంటాయి), 4.5 కేజీల కంటే ఎక్కువ బరువున్న రెండు తలల పాము (దీని తల, తోక ఒకే సైజులో ఉంటాయి), రైస్ పుల్లర్‌గా పిలిచే ఇరీడియం, కాపర్ కాయిన్‌ల్లో ఏదో ఒకటి ఉండాలంటూ ఎర వేస్తారు. వీటికే చుట్టుపక్కల ఉన్న డబ్బును ఆకర్షించి, పూజలో పెట్టిన దాన్ని రెట్టింపు చేసే శక్తి ఉంటుందంటూ నమ్మిస్తారు. ఈ నేపథ్యంలో ఈ మూడింటి పేర్లతో జరిగే మోసాలు ఎన్నో ఉంటున్నాయని, అలాంటి ముఠాలు తరుచుగా సిటీలో చిక్కుతున్నాయని అధికారులు చెప్తున్నారు.

 శివ సైతం బాధితుల ఇళ్లల్లో పూజకు కూర్చునేప్పుడు 1616 నాటి రైస్‌పుల్లర్‌గా పిలిచే కాపర్ కాయిన్ తన వద్ద ఉన్నట్లు నమ్మిస్తాడు.  ఈ పూజ నేపథ్యంలో రైస్‌పుల్లర్‌ను చూపించమంటూ ఎవరైనా అడిగితే... పగడ్భందీగా పార్శిల్ చేసిన ఓ డబ్బాను చూపించే శివ కాయిన్ అందులోనే ఉందంటూ నమ్మించి పూజలో పెడతాడు. మధ్యాహ్నం 1.30 - 2.00 గంటల ప్రాంతంలో పూజ పూర్తయినా... డబ్బు పెరగకపోవడంతో బాధితులు శివను ప్రశ్నిస్తే... ఆ సమయంలో లంచ్ నేపథ్యంలో బ్యాంకులు పని చేయవని, అందుకే డబ్బు ‘బారిష్’ కాలేదని, బ్యాంకులు తెరుచుకున్న తర్వాత వస్తుందంటూ కాలయాపన చేస్తాడు. చివరకు అదును చూసుకుని ఉమ్మెత్త గింజలు, సీసం కలిపిన ‘ప్రసాదం’పెట్టి వారు మత్తులోకి జారుకున్నాక డబ్బుతో ఉడాయిస్తాడు.

 ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో చంచల్‌గూడ జైల్లో ఉన్న శివను తదుపరి దర్యాప్తు నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో రెండుమూడు రోజుల్లో దీనిపై న్యాయస్థానం నిర్ణయం వెలువరించనుంది. కోర్టు అనుమతిస్తే శివను అదుపులోకి తీసుకుని అనేక కోణాల్లో ప్రశ్నించడానికి, అతడి ద్వారా ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement