సుడిగాలిలా ప్రియాంక గాంధీ!
కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథుల్లో ఒకరైన ప్రియాంక గాంధీ రాయ్ బరేలి లోకసభ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన తల్లి సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయ్ బరేలిలో సాధ్యమైనన్ని గ్రామాలను పర్యటించేందుకు, ఎక్కువ మంది ప్రజలను కలుసుకునేందుకు ప్రియాంక గాంధీ రెండు రోజుల కార్యక్రమాన్ని రూపొందించారు.
తొలి రోజే 18 గ్రామాల సందర్శన పూర్తి చేసుకున్నారు. దళిత వాడల్లో మహిళలను, ఇతర మహిళలను కలుసుకుని.. అక్కడే మధ్యాహ్న భోజనాన్ని పూర్తి చేసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు శివఘర్, బచ్రావన్ అసెంబ్లీకి చెందిన పలు ప్రాంతాల్లో పర్యటించారు. కొన్ని గ్రామాల్లో సోలార్ వాటర్ పంప్ సెట్ల పనితీరును గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రియాంక పర్యటనలో భారీగా ఎస్పీజీ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రియాంక సుడిగాలి పర్యటనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్ బరేలి పార్లమెంట్ నియోజకవర్గంలో ఊహించిని ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే.