లేగదూడల పెంపకంలో జాగ్రత్తలు | calf upbringing of care | Sakshi
Sakshi News home page

లేగదూడల పెంపకంలో జాగ్రత్తలు

Published Mon, Sep 22 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

calf upbringing of care

వర్గల్
  పశుసంపద అభివృద్ధికి దూడల పోషణే ప్రధానం. వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ నాణ్యమైన మేత అందించినప్పుడే ఇవి మంచి పాడి ఆవులుగా ఎదుగుతాయి. పశు పోషకుల నిర్లక్ష్యం, అవగాహనలేమి వల్ల పుట్టిన ప్రతీ 100 దూడల్లో 30 నుంచి 40 వరకు మృత్యువా త పడుతున్నాయి. ఈ సమస్యను అధిగమిం చేందుకు లేగదూడల పెంపకంలో తీసుకోవాల్సిన మెలకువలపై వర్గల్ మండల పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్‌బాబు (సెల్ : 9849457404) అందించిన సలహాలు, సూచనలు...
 
 దూడ పుట్టగానే ముక్కు రంధ్రాల మీద ఉన్న పొరలు తుడిచి శుభ్రం చేయాలి.
 శ్వాస ఆడనట్లయితే రొమ్ము భాగం మీద సున్నితంగా మర్దన చేయాలి. దూడ పుట్టగానే తల్లి దాన్ని నాలుకతో నాకేలా చూడాలి. తద్వారా తల్లి-దూడకు అనుబంధం పెరగడంతోపాటు, దూడ శరీరం మీద తడి ఆరిపోతుంది.
 పుట్టిన దూడ అరగంట, గంటలోపే లేచి నిలబడి జున్నుపాలు తాగుతుంది.

దూడ లేవలేని స్థితిలో బలహీనంగా ఉన్నట్లయితే దానిని లేపి నిలబెట్టి పాలు తాగేలా చూడాలి. జున్నుపాలు తాగిస్తే అజీర్తి చేస్తుందనుకోవడం అపోహ మాత్రమే. జున్నుపాలలో తేలి కగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్-ఏ, కెరోటిన్ ఎక్కువ శాతంలో ఉంటాయి. మలబద్ధకం లేకుండా ఇవి దోహదపడతాయి. జున్నుపాలు తాగని లేగలు, దుడ్డెలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.

 తల్లి దగ్గర దూడకు సరిపడా జున్నుపాలు లభించకుంటే అరచెంచా ఆముదం, గ్లాసు గోరు వెచ్చని నీళ్లు, కోడి గుడ్డు పచ్చ సొన, రెండు గ్లాసుల వేడి పాలు మూడు రోజులపాటు తాగించవచ్చు. తరువాత పోతపాలు అలవాటు చేయాలి.

 ఈనిన వెంటనే తల్లి పశువు, దూడను చూడకుండా జాగ్రత్త పడాలి. దూడకు జున్నుపాలు జాగ్రత్తగా తాగించాలి. పాలు గోరు వెచ్చగా శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉండాలి. చల్ల టి పాలు తాగిస్తే పారుడు రోగం వస్తుంది.
 
దూడ పుట్టిన మొదటి మూడు రోజులలో రోజుకు మూడు సార్లు జున్నుపాలు తాగించాలి. ఆ తరువాత రోజుకు రెండు సార్లు తాగించాలి.
 
మొదటి నెలలో ప్రతిరోజు దూడ బరువులో పదోవంతుకు సమానంగా పాలు తాగిం చాలి. రెండో నెలలో పదిహేనో వంతుకు, మూడో నెలలో ఇరవయ్యో వంతుకు సమానంగా పాలు తాగించాలి. పారుడు వ్యాధి లక్షణాలు కన్పిస్తే పాలు తగ్గించి పశు వైద్యుని సలహా తీసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే దూడ ప్రాణాలకే ప్రమాదం.
 
టీకాలు మరవద్దు...
 దూడ పుట్టగానే టింక్చర్ అయోడిన్ దూదిలో ముంచి బొడ్డుకు అద్దాలి. ధనుర్వాతం రాకుండా ఏటీఎస్ ఇంజక్షన్ వేయించాలి.
 
పుట్టిన 10-15 రోజులలో ఏలిక పాముల మందు వేయాలి. తరువాత నెలకు ఒకసారి చొప్పున నాలుగు నెలల వయస్సు వరకు ఈ మందు కొనసాగించాలి.
 
6-8 వారాల వయస్సులో గాలికుంటు వ్యాధి నివారణకు టీకా ఇప్పించాలి. 35 రోజుల తరువాత బూస్టర్ డోస్,ఆ తరువాత  4 నెలలకోసారి ఈ టీకా వేయించాలి.
 
చీడ పారుడు వ్యాధి రాకుండా 4-6 నెలల వయసులో టీకా మందు వేయించాలి. తిరిగి సంవత్సర వయస్సులో మళ్లీ టీకా వేయించాలి.
 
ఆరు మాసాల వయసులో గొంతు వాపు నివారణ టీకా వేయించాలి.
 
6-12 మాసాల వయసులో జబ్బవాపు వ్యాధి నివారణకు టీకా మందు ఇప్పించాలి. షెడ్ల బయట 15 రోజులకోసారి సున్నం చల్లి కాక్సిడియోసిస్ వ్యాధి రాకుండా అదుపు చేయవచ్చును. మూడు మాసాల వయసు దాటిన తరువాత రెండు నెలలకోసారి దూడ వెంట్రుకలు కత్తిరిస్తే గోమార్లు, పేలు పట్టకుండా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement