బహుళ ప్రయోజనకారి ఈ యంత్రం! | Multiple advantage of this machine! | Sakshi
Sakshi News home page

బహుళ ప్రయోజనకారి ఈ యంత్రం!

Published Sun, Aug 24 2014 11:42 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

బహుళ ప్రయోజనకారి ఈ యంత్రం! - Sakshi

బహుళ ప్రయోజనకారి ఈ యంత్రం!

ఆరుతడి, మెట్ట పంటల్లో అంతర సేద్యం చేస్తుంది.. బరువులూ మోస్తుంది..
దీనితో మహిళా రైతులూ సునాయాసంగా పనిచేయొచ్చంటున్న రూపశిల్పి

 
వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు, మహిళలు సైతం సులభంగా వ్యవసాయ పనులు చేసుకునేలా బహుళ ప్రయోజనకర యంత్రం అందుబాటులోకి వచ్చింది. మోటార్ సైకిల్‌కి వాడే రెండు టైర్లు, టీవీఎస్ ఎక్సెల్ ఇంజన్, ఇతర ఇనుపరాడ్‌లతో కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణరావు దీనికి రూపకల్పన చేశారు. చూడటానికి  సింపుల్‌గానే ఉన్నా ఏకకాలంలో అనేక రకాల వ్యవసాయ పనులకు ఉపయోగ పడుతుందని లక్ష్మణ రావు(98491 40465) చెబుతున్నారు. మహిళా రైతులు సైతం సులువుగా పనులు చేసుకోవడానికి దోహదపడాలన్నదే తన తపన అని ఆయన అన్నారు.

గతంలోనూ తయారుచేసిన పరికరానికీ రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. చిన్నసైజు మోటర్ సైకిల్ మాదిరిగా ఉండే ఈ యంత్రం, ఎక్స్‌లేటర్ సహాయంతో నడుస్తుంది. క్రమంగా ఎక్స్‌లేటర్ పెంచుకుంటుంటే యంత్రం ముందుకు సాగుతూ ఉంటుంది.
 దుక్కి దున్నుకునేందుకు ఉపయోగపడే నాగలి, మూడు చెక్కల గొర్రు, గుంటక వంటి పనిముట్లను దీనికి వెనుక వైపు అవసరాన్ని బట్టి సులభంగా బిగించుకోవచ్చు. పొగాకు, మిరప, పత్తి, కూరగాయ తోటలు, కంది, నువ్వు పంటల్లో, మామిడి, సపోట, బత్తాయి  తోటల్లో సులభంగా అంతర సేద్యం చేసుకోవచ్చని ప్రొ. లక్ష్మణరావు చెబుతున్నారు. యంత్రం పైభాగంలో అమర్చిన ఇనుపరాడ్‌ల సహాయంతో గడ్డిమోపులు, ఎరువుల కట్టలు, నీరు, పురుగుమందు ట్యాంక్ వంటివి మోసుకుపోగలదు. 4.5 హెచ్‌పీ సామర్ధ్యం గల మోటార్‌ని బిగించడం వల్ల ఒక ట్రాక్టర్ చేయగలిగినంత పని చేస్తుందని దీని రూపకర్త వివరిస్తున్నారు.

ఇది ఒక లీటర్ పెట్రోల్‌తో 30 నుంచి 40 కిలోమీటర్లు నడుస్తుందని చెప్తున్నారు. దీని తయారీకి రూ.11 వేలు ఖర్చవుతుంది. దుక్కులు దున్నడం దగ్గర నుంచి, పురుగు మందులు/ కషాయాలు/ జీవామృతం పిచికారీ వరకు వివిధ పనులు ఈ యంత్రంతో చేసుకోవచ్చు.  
 
- బాజీవలి, కందుకూరు, ప్రకాశం జిల్లా
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement