నల్లడబ్బు తెల్లనౌతోందా..? | black money will become white due to demonetization | Sakshi
Sakshi News home page

నల్లడబ్బు తెల్లనౌతోందా..?

Published Fri, Dec 9 2016 1:09 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

నల్లడబ్బు తెల్లనౌతోందా..? - Sakshi

నల్లడబ్బు తెల్లనౌతోందా..?

సమకాలీనం
నోట్ల రద్దు తదనంతర పరిణామాల్లో సర్కారు వైఫల్యం రాజకీయ ప్రత్యర్థుల స్వరంలో మార్పులకు ఆస్కారం కల్పిస్తోంది. స్వరాల్లాగే రాజకీయ చిత్రమూ మారేనా? అనే సందే హాలకూ తావిస్తోంది. ఎమర్జెన్సీ వాతావరణానికి ఆస్కారముందని లోగడ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ అగ్రనేత అడ్వాణీ.. ఏడాది తర్వాత ఆర్థిక ఎమర్జెన్సీని తలపిస్తున్న ప్రస్తుత వాతావరణంలో మౌనం వీడి స్వరం విప్పడం విశేషం. సొంత పార్టీలోనే భిన్నాభి ప్రాయాలతో ఉన్నవారికాయన మున్ముందు కేంద్ర బిందువౌతారా? వేచి చూడాల్సిందే!
 
వ్రతం చెడ్డా ఫలితం దక్కాలనేది సూక్తి. రెండూ దక్కితే తిరుగే లేదు. కానీ, వ్రతమూ చెడి, ఫలితమూ దక్కకుంటే... మిగిలేది వ్యథే! ప్రపంచ దృష్టినాక ర్షించేలా ‘నల్లసంపద’పై భారత్ ప్రకటించిన యుద్ధం తొలి అంకం సంకేతా లెలా ఉన్నాయి? పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులకు రాకుండా జనక్షేత్రంలోనే ఆగిపోయి, శాశ్వతంగా పోతుందనుకున్న నల్లధనం ఆనవాళ్లెక్కడ? చూడ బోతే అది రూటు మార్చినట్టుంది. సరాసరి నల్లధనంగానో, రూపుమారి తెల్ల ధనంగానో... ఎటు తిరిగి మళ్లీ బ్యాంకులకు చేరుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల అంచనాలు గల్లంతయ్యాయి. స్వపక్షంతో సహా ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. కొండంత రాగం తీసిన పాలకులకిప్పుడు ఏం పాట పాడాలో పాలుపోని పరిస్థితి! రద్దు వరకు చలామణిలో ఉన్న పెద్ద నోట్లు (రూ 1000, రూ 500) దాదాపు మొత్తంగానే దేశ ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి చేరే వాతావరణం కనిపిస్తోంది.

రద్దయిన 14.5 లక్షల కోట్ల రూపాయల్లో సుమారు 13 లక్షల కోట్లు ఇప్పటికే బ్యాంకులకు చేరాయి. డిసెంబర్ అఖర్న గడువు ముగిసేనాటికి... కనీసం లక్ష కోట్లయినా  చెల్లుబాటుకాని ‘నల్ల ధనం’గా బ్యాంకులకు రాకుండా మిగిలిపోతుందో, లేదో?అనుమానమే! రకరకాల లెక్కల ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థలో సమారు రూ. 6.5 లక్షల కోట్లు నల్లధనమున్నట్టు ఓ అంచనా. 5 లక్షల కోట్ల రూపాయల వరకున్న నల్లధనం పెద్దనోట్ల రద్దుతో రానేరాదని భావిస్తున్నట్టు కేంద్రం సుప్రీం కోర్టుకు విన్నవించింది. తాజా నిర్ణయంతో నల్లధనం పోయి ప్రభుత్వానికి కలిసివచ్చే 3 లక్షల కోట్ల రూపాయల అదనపు ద్రవ్యంతో సంక్షేమ కార్య క్రమాలు చేపడతామని కేంద్రమంత్రి ఒకరు హామీ వదిలారు. రద్దయిన ద్రవ్యంలో కనీసం 25 శాతం (అంటే, రూ. 3.6 లక్షల కోట్లు) నల్లధనం ఇక లెక్కలకెక్కదని సర్కారు విధేయ ఆర్థిక నిపుణులు సెలవిచ్చారు.

పార్లమెంటు కార్యకలాపాలతో పాటు వివిధ వ్యవస్థల్ని స్తంభింపజేసిన మహా క్రతువిది. నెల రోజులుగా దేశంలో వ్యాపారాలు, వాణిజ్యం, ఉత్పత్తులు, వ్యవసాయం, జనజీవనం ఇలా ఎన్నింటినో ప్రభావితం చేసిన ‘నోట్ల రద్దు’ నిర్ణయం సగటు మనిషిని నలిపేసింది. చేతిలో డబ్బుల్లేక చేష్టలుడిగేలా చేసింది. సుమారు వంద మంది అసువులు తీసింది. చెల్లని నోట్లు స్వీకరించడమే తప్ప, కనీసా వసరాలక్కూడా పనికొచ్చే నోట్లు ఇవ్వలేని బ్యాంకులు, ఏటీఎంల ముందు భారతదేశాన్నే బారులు తీయించింది. మీరీ వార్త చదివేటప్పటికి ‘నో క్యాష్’ బోర్డు వేలాడితే తప్ప, తెరచి ఉంచిన ప్రతి బ్యాంకు ముందూ జనాలు వరుస కట్టి ఉంటారు. ఇలా తాము దాచుకున్న డబ్బు తృణమో, పణమో తిరిగి తీసుకునేందుకు పోరు మొదలై సరిగ్గా నెల.
 
లెక్కతప్పినందుకే.... గురి మారిందా?
ప్రధానమంత్రి అనుభవ లేమి, అవగాహనా రాహిత్యం వల్లే నల్లధనం లెక్క తప్పిందా? ప్రస్తుత గందరగోళానికి అదే కారణమా? అవునంటున్నారు విశ్లేషకులు. ఆర్థిక నిపుణుల సంప్రదింపులతో సమగ్రంగా మదింపు చేయ కుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా, నోట్ల రద్దు తర్వాత సర్కారు నిలకడలేని నిర్ణయాలకు తోడు వారి గురి-లక్ష్యం కూడా మారింది. 30 రోజుల్లో 50 నిబంధనలు విధించారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన చేసేటప్పుడు మాటమాత్రంగానైనా ప్రస్తావన లేని నగదు రహిత ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు ప్రధాన లక్ష్యమై కూర్చున్నాయి. దేశంలో ఇప్పటివరకు 3 శాతం మించని నగదు రహిత ఆర్థిక నిర్వహణ ఇక వంద శాతానికెదిగి ఇప్పటికిప్పుడు డిజిటల్ భారత్ ఆవిష్కరణ జరగాలి. అందుకే, సర్కారు గురువారం తాయిలాలు కూడా ప్రకటించింది.

ఒక లెక్క ప్రకారం మన మొత్తం (తెలుపు, నలుపు) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రూ. 225 లక్షల కోట్లలో మూడో వంతు (సుమారు రూ. 75 లక్షల కోట్లు) నల్ల సంపద ఉందంటారు. ఇందులో సుమారు 8 శాతం, అంటే... రూ. 6.5 లక్షల కోట్లు ద్రవ్యరూపంలో ఉందని అంచనా! అందుకే మొత్తం ద్రవ్యం (రూ. 16.18 లక్షల కోట్లు)లో 30 శాతం వరకు నల్లడబ్బు ఉందనేది చాన్నాళ్లుగా ప్రచారం. ద్రవ్యంలో 86 శాతమున్న పెద్దనోట్ల రూపంలో నల్లడబ్బు కనీసం 3 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఆర్థిక నిపుణులు లెక్కలేస్తారు. సర్కారు తీవ్ర హెచ్చరికల తర్వాత చాలావరకు రాదనే అను కుంటారు. అయినా బ్యాంకులకు వచ్చి చేరడమే విస్మయం కలిగిస్తోంది.

ఇందులో ఇంకో వాదన కూడా ఉంది. కొత్త చట్టం (బిల్లు)లో ప్రతిపాదించిన దాన్ని బట్టి, తమ నల్లడబ్బును ముందు బ్యాంకుల్లో జమ చేసుకొని, తర్వాత స్వచ్ఛంద వెల్లడి ద్వారా 50 శాతం ప్రభుత్వానికి వదులుకొని, 50 శాతం (25 శాతం వెంటనే, 25 శాతం నాలుగేళ్ల తర్వాత తీసుకునేలా) మిగుల్చుకుంటా రని ఒక విశ్లేషణ. ఇందుకుగల ఆస్కారం తక్కువే! రాగల 3 వారాల్లో ఇంకెన్ని పెద్దనోట్లు బ్యాంకులకొస్తాయో! ఆ పైన కూడా సహేతుక కారణాలు చూపి రిజర్వుబ్యాంకు కౌంటర్లలో 2017 మార్చి మాసాంతం వరకూ డిపాజిట్ చేసు కోవచ్చు. నిలకడలేని సర్కారు చర్యల్లో... తదుపరి వచ్చే ఇంకే నిర్ణయమైనా ఉపశమనం కలిగిస్తుందేమో! అని తమ వద్దనున్న నోట్ల కట్టలు డిపాజిట్ చేసుకోకుండా నిరీక్షిస్తున్న వారూ ఉన్నారు. వారు ఎటుతిరిగి డిసెంబరు 30 వరకు ఆ డబ్బును బ్యాంకుల్లోకి తెస్తారు.
 
రంగు మారే నల్లధనం విసురుతున్న సవాల్!
తమ పాతనోట్లు బ్యాంకుల్లో జమ చేసుకొని, చెల్లుబాటయ్యే నోట్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపుల యుద్ధం చేస్తున్న సామాన్య జనం, రేపు రెండో పోరాటానికీ సన్నద్ధం కావాలేమో? అంచనా వేసిన నాలుగయిదు లక్షల కోట్ల నల్లధనం చిక్కట్లేదని కోపంతో ఉన్న సర్కారు, రేపు జనం ఖాతాలన్నింటినీ శల్య పరీక్ష చేస్తానంటుందేమో! రెండున్నర లక్షల రూపాయల వరకు చేసు కునే డిపాజిట్ల జోలికి రామన్న ప్రభుత్వం అప్పుడే మనసు మార్చుకున్న ట్టుంది. నవంబరు 10, డిసెంబరు 30 మధ్య, తమ బ్యాంకు ఖాతాల్లో యాభై వేలకు మించి డిపాజిట్ చేసుకున్న వారి వివరాలివ్వాలని ఆదాయపన్ను (ఐటి) శాఖ వారు తాజాగా బ్యాంకులకు ఆదేశించినట్టు సమాచారం. అదే జరిగితే, ఇది ఎలుకలున్నాయని ఇల్లు దగ్ధం చేసుకునే మరో చర్య అవుతుంది. ఎప్పట్నుంచో బ్యాంకేతర ఆర్థిక లావాదేవీల్లో డబ్బు జమ చేసుకున్నవారు, బంగారం  సమకూర్చుకున్న వారు అతికే కారణాలు చెప్పాల్సి వస్తుంది. సందిగ్ధమైన కొన్ని విషయాల్లో ఐటీ అధికారుల (నిర్వచనం లేని) విచక్షణ మేరకు నిర్ణయాలుంటాయని చట్టం చెబుతోంది.

డిసెంబరు 30 గడిచాక రెండో అంకంలో వేధింపులు తప్పవేమోనన్న భయం జనాల్ని వెంటాడు తోంది. మన ఆదాయపన్ను వ్యవస్థ అలా ఉంది. ఒక వంక సిబ్బంది కొరత, మరో వంక నిబద్ధత లేనితనం కూడా సామాన్యుల భయాలకు కారణం. మన దేశంలో నిర్ణయాలు ఎంత కటువుగా ఉంటాయో అమలు అంత లోపభూ యిష్టంగా ఉంటుంది. ఇప్పుడు జరిగిందదే! ముఖ్యంగా నిర్వహణ-నియం త్రణ వ్యవస్థలు ఎంతో లోపాయికారి అని నోట్లరద్దు, తదనంతర పరిణా మాల్లో స్పష్టమైంది. డిపాజిట్ల నిష్పత్తిలో కాకుండా పరిమితంగా విడుదల చేసిన కొత్త నోట్లు కూడా విచ్చలవిడిగా అక్రమార్కుల చేతికి చేరాయి. అందుకే, పాలకపక్ష ప్రజాప్రతినిధుల వద్దే కాక ఎక్కడ పడితే అక్కడ దొరి కిపోతున్నాయి. బయట బ్యాంకుల వద్ద రోజంతా నిరీక్షిస్తూ నాలుగు వేలు, రెండు వేల రూపాయలూ పొందలేక కోట్లాది మంది పడిగాపులు కాస్తుంటే, చట్టాన్ని చుట్టచుట్టిన వారి వద్ద కొత్త నోట్లు కోట్లలో దొరుకుతున్నాయి. ఇదెలా సాధ్యమౌతోందన్న ప్రశ్న సగటు మనిషిని వేధిస్తోంది. దేశ వ్యాప్తంగా లక్షల రూపాయల్లో కొత్త నోట్ల కట్టలు పట్టుబడుతున్న ఘటనలకు లెక్కే లేదు.

విశాఖలో కొటిన్నర, ముంబాయిలో 4 కోట్లు, బెంగళూరులో 6 కోట్లు, నిన్న టికి నిన్న చెన్నైలో 70 కోట్లు... అన్నీ కొత్తనోట్లు ! ఏమిటిది? కొత్త కరెన్సీ కద లికల మీద, బ్యాంకులకు ఆర్బీఐ డబ్బు కేటాయింపులపైన, బ్యాంకుల నిర్వ హణపైన... సరైన నిఘా-నియంత్రణ లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపి స్తోంది. గడచిన నెలరోజుల్లో  నల్లధనం అయిదారు మార్గాల్లో తెల్లధనంగా మారినట్టు నివేదికలున్నాయి. 1) అడ్డగోలుగా పాత తేదీలతో బంగారం కొను గోళ్లు 2) 15 నుంచి 30 శాతం కమిషన్‌తో బ్రోకర్ల ద్వారా పాత-కొత్త నోట్ల మార్పిళ్లు 3) బ్యాంకు వారితో చేతులు కలిపి పెద్ద మొత్తాల్లో కొత్తనోట్ల దారి మళ్లింపులు 4) అనువైన ఇతరుల ఖాతాల్లో డిపాజిట్లు 5) పాతనోట్లతో విక్ర యాలు అనుమతించిన వ్యాపార లావాదేవీల్లో తమ సొమ్ము కలపడాలు 6) నోట్ల మార్పిడి (ఎక్స్చేంజ్) అనుమతించినంత కాలం బ్యాంకుల్లో మనుషుల్ని పెట్టి సైక్లింగ్ పద్ధతిలో మార్చడాలు... ఇలా రకరకాల పద్ధతుల్లో నల్లధనాన్ని తెల్లధనం చేశారు, చేస్తున్నారు.
 
స్వరాలలాగే రాజకీయ చిత్రమూ మారుతోందా?
నోట్ల రద్దు తదనంతర పరిణామాల్లో సర్కారు వైఫల్యం రాజకీయ ప్రత్యర్థుల స్వరంలో మార్పులకు ఆస్కారం కల్పిస్తోంది. స్వరాల్లాగే రాజకీయ చిత్రమూ మారేనా? అనే సందేహాలకూ తావిస్తోంది. ఎమర్జెన్సీ వాతావరణానికి ఆస్కా రముందని లోగడ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ అగ్రనేత అడ్వాణీ.. ఏడాది విరామం తర్వాత ఆర్థిక ఎమర్జెన్సీని తలపిస్తున్న ప్రస్తుత వాతావ రణంలో మౌనం వీడి మళ్లీ స్వరం విప్పడం విశేషం. సొంత పార్టీలోనే భిన్నా భిప్రాయాలతో ఉన్నవారికాయన మున్ముందు కేంద్ర బిందువౌతారా? వేచి చూడాల్సిందే! నోట్లరద్దుకు మొదట్లో అనుకూలంగా మాట్లాడిన సీనియర్ నేత శరద్ పవార్ కూడా గొంతు మార్చారు. ‘ఆలోచన మంచిదే, ఆచరణే చెత్త... అత్యధికులు గ్రామీణ-వ్యవసాయదారులుండి, 92 శాతం మంది నగదు లావాదేవీలు జరిపే భారత వ్యవస్థలో నగదు రహిత ఆర్థిక నిర్వహణ ఎలా సాధ్యం?’ అని ఆయన ప్రశ్నించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా స్వరం మార్చి సర్కారు వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. మొద ట్నుంచీ వ్యతిరేకిస్తున్న వారు సరేసరి!
 
నోట్ల రద్దు ప్రక్రియ ఏ దేశంలో అయినా నల్లసంపదను, నల్లధనాన్ని నిర్మూలించడంలో సంపూర్ణ విజయం సాధించిన దృష్టాంతాలు లేవు.  ఫలి తాలు కొంత మేరకే! కానీ, నిర్వహణా లోపాల వల్ల అదే ప్రక్రియ ఆర్థిక వృద్ధిని నిలువరించి మాంద్యాన్ని సృష్టించిన దాఖలాలున్నాయి. ఒకవైపు నోట్లను రద్దు చేసి, మరోవంక కొత్త నోట్ల పంపిణీని పరిమితం చేసి, నగదు రహిత లావాదేవీల వైపు దేశాన్ని నడుపుతున్న ప్రస్తుత వ్యవహారం వల్ల పన్నుల విధింపు-వసూళ్ల పరిధి పెరగడం ఖాయం. ఈ క్రమంలో... బ్యాంకే తరంగా ఉన్న అనియత ఆర్థిక వ్యవస్థను బ్యాంకుల పరిధిలోకి తెచ్చే ఓ ప్రక్రియగా ఇది మిగలొచ్చు! ఖాతాల్లో జమ చేసుకున్న సొమ్ము పొంద లేకపోవడానికి కారణం బ్యాంకులు కాదన్న స్పృహ కలిగిన ప్రజలు బ్యాంకులపై దాడి చేయకపోవచ్చు. అంతమాత్రాన అది జనంలో ఆగ్రహం లేకపోవడం కాదు, జరుగుతున్న అవ్యవస్థకు ఆమోదం అంతకన్నా కాదు. జనం అసౌకర్యాల్ని, ప్రజాగ్రహాన్ని వాస్తవికంగా కొలిచే సాధనాలు ప్రజా ప్రభుత్వాలకు అవసరం. పన్ను వసూళ్ల రుచిమరిగిన పాలకులకు రాబడి వేరు ఆదాయం వేరన్న స్పృహ కూడా అత్యవసరం.
 

దిలీప్ రెడ్డి
 ఈమెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement