సైద్ధాంతిక విస్మృతి కమ్యూనిస్టులకు ‘శాపం’!
విశ్లేషణ
మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత పెరగవలసిన ప్రస్తుత దశలో అవి మరింతగా బలహీన పడుతున్నాయి. కొద్దిమాసాల క్రితం జరిగిన ఢిల్లీ శాసన సభ ఎన్నికలూ, నిన్నా మొన్నటి బీహార్ ఎన్ని కలూ, నేటి వరంగల్ ఎన్నికల దాకా వామపక్షాల పాత్ర, వాటి వైఫల్యాలు మనం గమనించినవే. పైగా మితవాద బి.జె.పికి ప్రత్యామ్నాయ వేదికగా ఢిల్లీ, బిహార్ ఎన్ని కలలో కొన్ని పార్టీలు ముందుకొచ్చారు. కానీ బి.జె.పిని విమర్శించడంలో ముందుండే వామపక్షాలు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో పోషించిన పాత్ర ఏమిటి? ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడాల్సి ఉన్న కమ్యూనిస్టు పార్టీలు, ఉనికిని కాపాడుకోవడం పేరిట విడిగా సంఘటనలు కట్టి ఎన్నికల గోదాలోకి దిగాయి. కాగా, సుదీర్ఘకాలంపాటు ఈ పార్టీలు ప్రతి ఎన్నికలలోనూ ఏదో ఒక బూర్జువా పక్షంతో జట్టుకడుతూనే ఉన్నాయి.
అకస్మాత్తుగా ఇప్పుడు తమ మహాసభలలో తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఇక ముందు ఏ బూర్జువా పక్షం తోను ఎన్నికల పొత్తులు పెట్టుకోబోమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. అయితే విడిగా సంఘటనలు కట్టి పోటీ చేసిన ఢిల్లీ, బీహార్ ఎన్నికలలో కూడా అవి డిపాజిట్ లను కూడా కోల్పోయి పరాజయం పాలవడం గమ నార్హం. ఇక తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుల అభ్యర్థి సంపాదించిన ఓట్లకంటే దరిదాపు రెట్టింపు ఓట్లను ‘‘శ్రమ శక్తి పార్టీ’’గా పోటీ చేసిన అభ్యర్ధి పొందడాన్ని కూడా గుర్తించాలి.
మరి ఇంతటి దారుణ వైఫల్యాల దిశగా వామ పక్షాలు ఎందుకు దిగజారాయి? అనేకమంది విమర్శిస్తున్నట్లుగా ఈ పార్టీల ‘‘పిడివాదమా’’? లేకుంటే ఆ పార్టీలే తరచుగా తమ ఆత్మవిమర్శన డాక్యుమెంటులలో పేర్కొనే ‘పార్లమెంటరిజంకు లోనవ్వడం’ అనే బలహీనతా? ఈ ప్రశ్నకు జవాబును చెప్పుకోకుండా, భవిష్య త్తులో కూడా కమ్యూనిస్టు పార్టీలు పురోగమించడం అసాధ్యం! కాగా కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంటరీ బలహీనతలకు లోనయ్యాయనే వాదనలో కొంత నిజం ఉన్నా, ఈ కారణం వామపక్షాల వైఫల్యానికి సంబంధిం చిన మూలాలను సంపూర్ణంగా చూడడానికి సరిపోదు. భారత్‌తో సహా వివిధ దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడడం వెనుక కారణాలను మనం కేవలం పార్ల మెంటరిజంలోనే కాక ఇతరేతరంగా కూడా చూడాలి.
కమ్యూనిస్టులు పార్లమెంట్లలో పాల్గొనటానికి సంబంధించి రష్యా విప్లవ క్రాంతదర్శి లెనిన్ పదే పదే ప్రస్తావించిన ఒక అంశం ‘‘పరిస్థితి విప్లవకరంగా లేనపుడు కూడా, విప్లవకర మనోస్థితిని కలిగి ఉండడమే నిజమైన విప్లవకారుడి లక్షణం’’. పార్లమెంటరీ రాజకీ యాలవంటి ఏ మాత్రం రొమాంటిసిజం లేని పోరాట పద్ధతులలో పాల్గొంటూనే, కమ్యూనిస్టులు తమ పోరాట మనోస్థితిని కాపాడుకోగలగాలన్నది దీని సారాంశం.
లెనిన్ వివరించిన మరో అంశం: ‘‘విమర్శ.. అత్యంత తీక్షణమైన, నిర్దాక్షిణ్యమైన, రాజీలేని విమర్శ పార్లమెంటరిజం మీదా, పార్లమెంటరీ కార్యకలాపాల మీదా కాక, పార్లమెంటరీ ఎన్నికలనూ, పార్లమెంటరీ వేదికనూ విప్లవ, కమ్యూనిస్టు పద్ధతిలో వినియోగించు కోవడం చేతకాని నాయకులమీద, అంతకంటే ఎక్కు వగా ఇష్టం లేని నాయకులమీద చేయాలి...’’ స్థూలంగా కమ్యూనిస్టు సిద్ధాంతం పార్లమెంటరిజానికి సంబం ధించీ, పోరాట మనోస్థితి గురించి చెబుతున్నదాని సారాంశం ఇది! కాబట్టి మన కమ్యూనిస్టు పార్టీలు తమ లోపాలకు పార్లమెంటరిజాన్ని సాకుగా చూపటం కూడా సైద్ధాంతిక బలహీనతే. దీంతోనే కమ్యూనిస్టు పార్టీల పరి స్థితి ‘పూలమ్మిన చోటే కట్టెలమ్మేదిగా’ మారిపోయింది.
వామపక్షాలు తమ సైద్ధాంతిక మూలాలనుంచి దూరంగా జరిగిపోవటం, అంతకు మించి వాటికి ఏర్ప డిన సైద్ధాంతిక విస్మృతిలోనే వాటి బలహీనతలు, పత నానికి మూల కారణాలున్నాయి. ఈ అంశాన్ని పరిశీ లిద్దాం. 1939- 45 నాటి రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ చారిత్రక విజయంతో తూర్పు యూరోప్‌లో ఒక సోషలిస్టు శిబిరమే ఏర్పడటం వంటివి ప్రపంచ పరిస్థితిలో గణనీయమైన మార్పును తెచ్చాయి. ఆ కాలంలో వివిధ దేశాలకు చెందిన పలువురు నేతలూ, ప్రజలూ సోవియట్ అభిమానులయ్యారు. తమ తమ దేశాలకు సంబంధించి ఎటువంటి లోతైన, సమగ్ర పరిశీలనా, అధ్యయనం లేకుండానే ప్రత్యక్షంగానో, పరో క్షంగానో సోవియట్ యూనియన్ దిశానిర్దేశంలో నడవ డం అనేది అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీలకు అలవా టుగా మారింది. ఈ పార్టీలూ, వాటి నాయకత్వంలో అధికభాగం పరిమాణాత్మకంగా ఎదిగాయే కానీ, వాటి సైద్ధాంతిక పటిమ మాత్రం క్షీణించింది.
ఈ క్రమంలోనే, 1991లో సోవియట్ పతనంతో ఈ పార్టీలు మరింత తీవ్ర అస్థిత్వ సమస్యలోకి పడిపో యాయి. గతంలోలాగా కనీసం పడికట్టు మాటలూ, నినాదాలూ, యాంత్రికమైన పనితీరు నిర్వహించిన స్థాయిలో కూడా ఈ పార్టీలు నిలబడలేకపోయాయి. చివరికి పరిస్థితి నిన్నటి ‘‘ఇలా మిగిలాం’’ దశ నుంచి నేడు ‘ఇలా మిగిల్చారు’ దశకు చేరింది. అంటే, కమ్యూ నిస్టు పార్టీలు తమ ప్రభను కోల్పోవడానికీ కారణం ఆ పార్టీల అంతర్గత సైద్ధాంతిక డొల్లతనంలోనే అధికంగా ఉంది. దాంతో వాటి స్థితి నేడు సంపూర్ణంగా దిగ జారింది. అందుకే నేడు విప్లవాలూ, పెనుమార్పులూ ప్రపంచంలో ఎంత అవసరం అనేది పక్కన పెడితే, మనుగడ కొనసాగింపు కోసం కమ్యూనిస్టు పార్టీలలో అంతర్మథనం రూపంలో విస్పోటనలు కచ్చితమైన అవసరం.
ఇది జరిగి, ఆ పార్టీలు నిలబడలేకపోతే, చరిత్ర తన ముందడుగుకు కావల్సిన శక్తులను తానే సృజించు కుంటుంది. లాటిన్ అమెరికాలోను, పలు చోట్ల జరుగు తోంది ఇదే. కాబట్టి, ఇతర పాలక పక్షాల గెలుపోటము లను నిర్ణయించగల తమ నిన్నటి స్థితినీ, స్థాయినీ కూడా కోల్పోయిన భారత కమ్యూనిస్టు పార్టీలు ఇక కోల్పోయేందుకు ఏముంది? డిపాజిట్లు మినహా... అని ప్రజ లు భావించే దుస్థితి నుంచి బయటపడేందుకు ఉన్న ఒక ప్రధాన మార్గం ఏదంటే.. ఎన్నికలలో పోటీల గురించీ, దీర్ఘ దృష్టిలేని రాజకీయ కార్యాచరణ గురించి కాక ఆత్మ విమర్శతో కూడిన ఒక సుషుప్తావస్తలోకి, అంతఃస్థితిలోకి కొంతకాలం పాటైనా వెళ్ళడమే...!
(వ్యాసకర్త: డి.పాపారావు, సామాజిక విశ్లేషకులు సెల్: 9866179615)