జనమే సార్వభౌమాధికారులు
విశ్లేషణ
రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఆర్టికల్ 361 కింద ఉన్న మినహాయింపు న్యాయసమీక్షను నిరోధించలేదు. ఒక పబ్లిక్ అథారిటీగా గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ అవసరమైన సమాచారం ఇవ్వవలసిందే.
రాజ్యాంగం రూపొందించిన పాలనా వ్యవస్థలో పూర్తిస్థాయి రాష్ట్రా నికి గవర్నర్ ఉంటారు. ఆ రాజ్యాంగ పదవిని రాజ్ పాల్ అంటారు. కేంద్రపా లిత ప్రాంతానికి పాలకు డిగా లెఫ్టినెంట్ (ఉప) గవర్నర్ ఉంటారు. శాసన సభ, ముఖ్యమంత్రితో కూడిన మంత్రివర్గం కొన్ని కేంద్రపాలిత రాష్ట్రాలలో ఉంటాయి. ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ విధంగా ముఖ్యమంత్రులు ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఉంది. మంత్రి మండలి, అసెంబ్లీ, ఇతర పాలనా రంగాలన్నీ ఉపగవర్నర్ కింద పనిచేస్తుంటాయి. మంత్రి మండలి సలహాను అనుసరించి గవర్నర్ పాలనా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కొన్ని పరిమిత రంగాలలో గవర్నర్‌కి సొంతంగా ఆలోచించి నిర్ణయం తీçసుకునే అధికారం ఉంది. ముఖ్యంగా కావలసిన మెజారిటీ లేనపుడు ముఖ్యమంత్రి, అతని మంత్రిమండలి సలహాను గవర్నర్ వినాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరు ముఖ్యమంత్రి కావాలనే విషయంలో కూడా గవర్నర్‌కు సొంత అధికారాలు ఉంటాయి.
ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి కొన్ని ప్రత్యేక నియమాలను 64వ రాజ్యాంగ సవరణ ద్వారా 1991లో రూపొందించారు. ఉపగవర్నర్ (లెఫ్టినెంట్ గవర్నర్ లేదా ఎల్‌జి)కు కొన్ని సందర్భాలలో సొంత అధికారా లున్నాయి. అయితే గవర్నర్, ఉప గవర్నర్ పదవులను రాజ్యాంగం కల్పించింది. వారు సమాచార హక్కు పబ్లిక్ అథారిటీ నిర్వచనం పరిధిలోకి వస్తారు. సమాచారాన్ని ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉండాలి.
రాష్ట్రపతి, గవర్నర్ సార్వభౌమ అధికారాలు కలిగి ఉన్నారు కనుక మామూలు జనానికి సమాచారం చెప్పనవసరం లేదని వాదించారు. బొంబాయి హైకోర్టు సార్వభౌమాధికారం అంటే ఏమిటో వివరించింది. సార్వభౌమాధికార లక్షణాలు రెండు. మొదటిది, మొత్తం ప్రజానీకం గవర్నర్ అధీనంలో ఆజ్ఞానువర్తిగా ఉంటుంది. రెండోది, గవర్నర్ ఎవరి ఆజ్ఞలకూ బద్దుడుగా ఉండడు.
సార్వభౌముడికి శాసనాధికారాలు, పాలనాధికారాలు ఉంటాయి. వివాదాలను విచారించి పరిష్క రించే అధికారమూ ఉంటుంది. అయితే ఈ అధికారం ఎవరికి ఉంది? రాజ్యాంగ పీఠిక ప్రకారం సార్వభౌమ సమసమాజ, మతాతీత, ప్రజాస్వామ్య రాజ్యాధికారం భారతదేశ ప్రజలకు కట్టబెట్టింది. రాష్ట్రపతి, గవర్నర్.. మంత్రిమండలి సలహా లేకుండా ఏ నిర్ణయాలూ తీసుకోలేరు, అతికొద్ది సందర్భాలలో తప్ప, కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతిలకు లోబడి గవర్నర్‌లు పనిచేయాలి. గవర్నర్ అయితే కేంద్రం ఇష్టపడినంత కాలం మాత్రమే పదవిలో ఉంటారు. కనుక వారికి సార్వభౌమ అధికార లక్షణాలు లేవన్నట్టే.
రాష్ట్రపతి దేశానికి అధినేత. గవర్నర్ ఒక రాష్ట్రానికి రాజ్ పాల్. ఆర్టికల్ 361 కింద కొన్ని మినహాయిం పులు తప్ప వారికి పెద్దగా సార్వభౌమ ప్రత్యేకత లేమీలేవు. సమాచార హక్కు కింద చెప్పనవసరంలేని మినహాయింపు ఏదీ లేదు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(ఎ) ప్రకారం దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను దెబ్బతీసే ఏ సమాచారమూ ఇవ్వనవసరం లేదు. అయితే రాష్ట్రపతి, గవర్నర్‌లకు సంబంధించిన సమాచారం కూడా దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటే ఇవ్వనవసరం లేదు. ఆర్టికల్ 361 ఇచ్చే మినహాయింపు కూడా పరిమితమైనదే. దురుద్దేశపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలను విచా రించే అధికారం కోర్టులకు ఉందని అక్కడ ఆర్టికల్ 361 మినహాయింపు వర్తించబోదని రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2006) 2 ఎస్.సి.ఎస్.సి 1లో తీర్పు చెప్పింది.
రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఆర్టికల్ 361 కింద ఉన్న మినహాయింపు న్యాయసమీక్షను నిరోధించలేదు. ఒక పబ్లిక్ అథారిటీగా గవర్నర్‌గానీ, రాష్ట్రపతిగానీ సమాచారం ఇవ్వవలసిందే. అలా ఇవ్వకుండా ఆపడానికి ఆర్టికల్ 361 ఉపయోగపడదు. ప్రజాస్వామ్యంలో సార్వభౌమాధికారం ఒక అధికార హోదాకు పరిమితమై ఉండదు. ప్రజలు, వారెన్నుకున్న ప్రతినిధుల పార్లమెంటు, వారినుంచి వచ్చిన మంత్రిమండలి, ప్రతిని«ధు లంతా ఎన్నుకునే రాష్ట్రపతి, శాసనాలు పాలనా నిర్ణయాలు సమీక్షించే రాజ్యాంగ న్యాయస్థానాలు ఈ సార్వ భౌమాధికారాన్ని పంచుకుంటాయి. గవర్నర్ రాజ్యాంగాన్ని శాసనాన్ని రక్షిస్తానని, రాజ్యాంగం, శాసనాల ప్రకారం నడుస్తానని ప్రమాణ స్వీకారం చేస్తాడు. సమాచారం ఇవ్వాలని పీఐఓ, మొదటి అప్పీలు అధికారి, లేదా సమాచార కమిషన్‌గానీ ఆదేశిస్తే, తన ప్రమాణం ప్రకారం ఆ సమాచారాన్ని వెల్లడించాలని, ఆర్టీఐ చట్టాన్ని ఆ విధంగా పాటించి రక్షించాలని బొంబాయి హైకోర్టు వివరించింది.
దీనిపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే జారీ చేసింది. అయితే స్టే ఆ ఒక్క కేసుకే వర్తిస్తుంది కాని మొత్తం గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్‌లంతా ఆర్టీఐ కింద జవాబులు ఇవ్వనవసరం లేదని భావించే వీల్లేదు. రాజకీయ పార్టీల నాయకులతో ఢిల్లీ ఉప గవర్నర్ సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలను వెల్లడించాలని సీఐసీ ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వుపైన ఉప గవర్నర్ కార్యాలయం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. తాత్కాలిక స్టే ఇచ్చారు. తరువాత కూడా ఎల్‌జీ కార్యాలయం ఆర్టీఐ దరఖాస్తులకు జవాబులు ఇస్తూనే ఉన్నది. కనుక పబ్లిక్ అథారిటీ హోదాపై అది స్టే కాదని గమనించాలి. కనుక రాష్ట్రాల గవర్నర్‌లు, కేంద్రపాలిత ప్రాంతాల ఉప గవర్నర్‌లు సమాచార చట్టం కింద సమాచారం ఇవ్వవలసిందే.
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్