
వెయ్యేళ్ల యుద్ధం ఎవరి మీద?
దివంగత జుల్ఫికర్ ఆలీ భుట్టో ఒక సందర్భంలో భారత్‌తో వెయ్యేళ్ల యుద్ధాన్ని సాగిస్తామన్నారు.
జాతిహితం
దివంగత జుల్ఫికర్ ఆలీ భుట్టో ఒక సందర్భంలో భారత్‌తో వెయ్యేళ్ల యుద్ధాన్ని సాగిస్తామన్నారు. 1990 వేసవిలో, ఉద్రిక్తతలు మరోమారు చెలరేగుతుండగా ఆయన కుమార్తె ప్రభుత్వం సైన్యం నేతృత్వంలోని అధికార వ్యవస్థ ఒత్తిడి కి గురై ఉన్నప్పుడు ... ఆమె కూడా తిరిగి అదే పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి కావడమే కాదు, చారిత్రాత్మకమైన ఆ రోజులే వివాదాలమయమైనవి. పాకిస్తాన్ ఆ వ్యాఖ్య ద్వారా భారత్‌కు అణు యుద్ధ హెచ్చరికను పంపిందని ఈ రచయితతో సహా చాలా మంది అప్పట్లో విశ్వసించారు. కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వం సైతం పాక్ బెదిరింపులపై మాట్లాడాల్సి వచ్చింది. వెయ్యేళ్ల యుద్ధం గురించి బెదిరించేవారు వెయ్యి గంటల యుద్ధంలోనైనా నిలవగలరేమో చూసుకోవాలి’’ అంటూ సింగ్ అద్భుతంగా స్పందించారు.
గెలుపుకు మూల్యం ఏమిటి?
వెయ్యి గంటలంటే ఏమిటో వెంటనే ఆలోచించాను, అదేమీ చిన్నది కాదు, 42 రోజుల యుద్ధం. అంటే 1965, 1971లలో జరిగిన రెండు యుద్ధాలను కలిపినాగానీ ఇంకా ఏడు రోజులు ఎక్కువే. నేనప్పుడు ‘ఇండియా టుడే’కు ఈ ఉద్రిక్తతల మీద కవర్ పేజీ కథనాన్ని తయారుచేస్తున్నాను, నా మిత్రుడు, సునిశిత సైనిక విశ్లేషకుడు రవి రిఖ్యే భారత్ గెలుస్తుందనే ముందస్తు ప్రమేయంతో వెయ్యి గంటల యుద్ధం ఊహాత్మకంగా జరగడం గురించి అంచనాలు కట్టాడు. ఆ యుద్ధంలో గెలవడానికి ఆహుతైపోయే విమానాలు, ట్యాంకులు, సాధారణ వాహనాలు, జీవితాల సంఖ్యను, పేల్చాల్సివచ్చే మందుగుండు సామగ్రి, ఇతర ఆర్థిక నష్టాలను అంచనా కట్టి విజయానికి చెల్లించాల్సిన మూల్యం ఎంతో అంచనాకట్టాం. విజయం కోసం అపారమైన మూల్యం చెల్లించాల్సి రావడమే కాదు, పాక్‌తో ఉన్న నిజమైన సమస్యలు పరిష్కారం కావనే నిర్ధారణకు వచ్చాం. ఎంత చిన్న యుద్ధాన్ని, ఎంత అను కూల పరిస్థితుల్లో చేసినాగానీ అందుకు మనం భరించలేనంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందనే మా ముందస్తు నిర్ధారణను అది రుజువు చేసింది. ఆకట్టుకునే విధంగా ఉండాలని 1971లో పూర్తి స్థాయి నిర్ణయాత్మక విజ యాన్ని సాగించినా, రెండు దశాబ్దాల తర్వాత మనం మరింత భారీ సేన లతో, మెరుగైన ఆయుధ, సాధన సంపత్తితో, మరింత ఆగ్రహంగా ఉన్న ప్రజ లతో మరో యుద్ధం వాకిట నిలిచామని కూడా జోడించాం.
వెంటనే మా సహ భారత వ్యూహాత్మక నిపుణులు మాపై విరుచు కుపడ్డారు యుద్ధంలో ఖర్చయిపోయే ట్యాంకులు, విమానాలు, క్షిపణుల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టడానికి అయ్యే వ్యయాలను లెక్కగట్టామని, అవన్నీ అంతకు ముందే నిల్వ ఉన్నాయి, అరుగుదలకు గురవుతాయనే విష యాన్ని విస్మరించామనేది మా కథనంపై వారి ప్రధాన అభ్యంతరం. విజయం సాధించిన సైన్యాలు ఎప్పుడూ పాత సాధన సంపత్తి స్థానే కొత్త వాటిని సమకూర్చుకుంటాయని, 1971లో కూడా మనం అదే చేశామంటూ మేం దాన్ని కొట్టిపారేశాం. మా విశ్లేషణ ఎంతగా శాంతివాద పూరితమైన దంటే పలు ప్రముఖ పాకిస్తానీ ఇంగ్లిష్, ఉర్దూ పత్రిక లు దాన్ని పునర్ము ద్రించాయి. ఒక పత్రిక మరీ తెగించి ఏకంగా మా కథనం నకలును యథా తథంగా ప్రచురించింది. 1971లో ఢాకాలో నియాజీ, అరోరాకు లొంగి పోతున్నప్పటి ఫొటోనూ, నిర్ణయాత్మక విజయమే కానీ దేన్నీ పరిష్క రించలేదు. మరో యుద్ధం మూర్ఖపు ఆలోచన అనే శీర్షికను కూడా అది జోడించింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ పత్రిక సంపాదకుణ్ణి సైనిక ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. భారత ప్రచారాన్నీ, ఆ ఫొటోను ఎలా ప్రచురించారు? అని అడిగారు. ఆ పత్రిక మొదటి పేజీలోనే అందుకు క్షమాపణలు చెప్పుకుని, ఆ తదుపరి ఒక రిటైర్డ్ పాక్ వైమానిక దళ ఎయిర్ మార్షల్ రాసిన వ్యాసాలను వరుసగా ప్రచురించింది. కొత్త యుద్ధంలో పాక్ మూడు రోజుల్లో ఎలా భారత్‌ను మట్టి కరిపిస్తుందో, తమ ట్యాంకులు జైపూర్‌ను ఎలా ముట్టడిస్తాయో ఆయన వివరించారు. అంతేకాదు, శాంతి కోసం భారత్, కశ్మీర్‌ను వదులుకోవడమే కాదు, ‘‘అదుపులో ఉంచగలిగిన’’ పరిమాణంలోని కొన్ని దేశాలుగా విభజించడానికి సైతం అంగీకరించాల్సి వస్తుందని కూడా చెప్పారాయన.
జాతీయ భద్రతా రాజ్యంగా పాక్
ఇరవై ఐదేళ్లు గడిచాక, ఒక చిన్న యుద్ధాన్ని (కార్గిల్) చేశాక, దాదాపు పూర్తిస్థాయి యుద్ధం చేసే వరకు (ఆపరేషన్ పరాక్రమ్) పోయాక.... ఇప్పుడు మనం మరోసారి నాటి పాక్ వెయ్యేళ్ల యుద్ధం పిలుపును నాటి విమానాలు, ట్యాంకులు, లేదా అణు క్షిపణుల లెక్కలకు దూరంగా నిలచి సరికొత్త దృక్కోణం నుంచి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఆ పని చేసిన నేను రెండు ప్రతిపాదనలు చేస్తున్నాను. ఒకటి, మనం విశ్వసిస్తున్నదానికి విరు ద్ధంగా వెయ్యేళ్ల యుద్ధం నిజంగా జరగడమే కాదు, అది 1947 నాటి దేశవిభజనతో మొదలై ఇప్పుడు 70వ ఏడాదిలో ఉంది. రెండు, వెంటనే నాకు కొత్తగా సంఘీ తీర్థం పుచ్చుకున్నవాడు’’ అనే ముద్ర వేసేయకుండా ఆలోచించండి.... ఆ యుద్ధం చాలా వరకు ఒక్క దేశం మాత్రమే (పాకిస్తాన్) చేస్తున్నది, ప్రధానంగా తనపైన తానే సాగిస్తున్నది.
నేను పాక్ వ్యతిరేతకను రెచ్చగొట్టేవాడినని ఎవరో ఆరోపించారు. ఆ దేశం అనివార్యంగా స్వీయ విధ్వంసానికి గురవుతుందనీ నేను విశ్వసించను. అలా జరగాలని కోరుకోను. పైగా పాకిస్తానీ జాతీయవాదం చాలా బలమైన శక్తిగా ఎదిగిందని, అదిప్పుడు నిజమైన ఉద్వేగపరమైన, భావజాలపరమైన ఐక్యతగల జాతి రాజ్యమని భావిస్తాను. దీనిపై మీ వాదనలు ఎలానైనా ఉండనివ్వండి. అసలు విషయం మాత్రం ఈ జాతీయ ఐక్యత ఇస్లాం భావ జాలంపై ఎంతగా ఆధారపడి ఉందో, అంతగానూ భారత్‌పట్ల అసాధారణ అనుమానంపై ఆధారపడినది. బలమైన, పెద్ద, ‘‘మరింత జిత్తులమారి’’ భారతదేశం నిరంతరం మీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు చేస్తున్నదని, అందుకే మీరు నిరంతరం దానితో యుద్ధం చేయాల్సి వస్తోందని ఊహించుకోండి. ఇది, ఆచరణలో మీకు మీరే ఓ పీడకలను కనిపెట్టి, అదే మీ మనసులను శాసించేట్టు చేయడమే అవుతుంది. పాక్ ఒక బలమైన, అసాధా రణమైన జాతి రాజ్యంగా అవతరించడానికి అదే కారణమైంది. పాక్, సౌదీ అరేబియాలా పూర్తిగా ఇస్లామీకరణ చెందలేదు లేదా ఇరాన్‌లోలా పూర్తిగా మత పెద్దల చెప్పు చేతుల్లో నడిచేదీ కాదు లేదా ఒకప్ప టిలా సైనిక నియంతృ త్వమూ కాదు. అలా అని నిజమైన ప్రజాస్వామ్యం కూడా కాదు. అది జాతీయ భద్రతా రాజ్యానికి ప్రామాణిక ఉదాహరణగా నిలుస్తుంది. అహం కారం జాతీయవాదం, ధిక్కారం, అనుమానం, సమస్యాత్మకమైన రక్షణా త్మకత, ఎప్పుడూ వెనుకాముందూ, అటూఇటూ భయంతో, ఆగ్రహంతో చూస్తూ ఉండే రాజ్యం కావడం వంటి జాతీయ భద్రతా రాజ్యానికి ఉండా ల్సిన అన్ని లక్షణాలూ దానికి ఉన్నాయి.
తనపైన తానే యుద్ధం చేయాల్సిన రాజ్యం
గత మూడు వారాలుగా పాకిస్తాన్ నుంచి చాలా గందరగోళపరిచే వార్తలు వస్తున్నాయి. పాకిస్తానీ మహిళలా జట్టు టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో మనల్ని, ఆ తర్వాత వెస్ట్‌ఇండీస్‌ను ఓడించింది, పాక్ చేతిలో ఓడిన ఆ జట్టే చివరికి ఫైనల్స్‌కు చేరింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని లాహోర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. అదే సమయంలో సల్మాన్ తసీర్ హంతకుడనే అభియోగంతో ఉరితీసిన మక్బూల్ ఖాద్రీ మద్దతుదా రులు ఇస్లామాబాద్‌ను ముట్టడించారు. బాంబు పేలుడు వహాబీ దియోబందీ గ్రూపు చేసినది కాగా, తహీరుల్ ఖాద్రీ మద్దతుదారులు బారెల్వి సూీఫీయిజం సభ్యులు. అయితే సరిగ్గా దీనికి ముందే, కెనడియన్-పాకి స్తానీ చపల బుద్ధి మనిషి తహీరుల్ ఖాద్రీని భారత్‌లో ప్రముఖునిగా చూశారు. మన ప్రధాని ఢిల్లీలో జరిగిన సూఫీ సదస్సులో అతన్ని మధ్యేవాదిగా పేర్కొనడం చెప్పుకోదగినది.
ఈ వ్యవహారాలను అర్థంచేసుకోవడానికి నేను నా పాకిస్తానీ మిత్రుడు, కాలమిస్టు ఖలీద్ అహ్మద్ సహాయాన్ని కోరాను. పాక్‌లోని బారెల్వీ సూఫీయిజంలో రెండు విభిన్న పాయలు ఉన్నట్టనిపిస్తోంది. ఒకటి, (సున్నీ తెహ్రిక్) ఇస్లామాబాద్‌లో మృతదేహాలను చూడాలని కోరుకునేది. మరొకటి తహిరుల్ ఖాద్రీకి చెందినది. ఆయన మద్దతుదార్లే ఇమ్రాన్‌ఖాన్‌తో కుమ్మక్కై, సైన్యం తరపున ఇస్లామాబాద్‌ను ముట్టడించారు. ప్రజాస్వామ్యం నిజంగానే వేళ్లూనుకునేట్టుంటే, కొత్తగా ఎన్నికైన నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం కోసం సైన్యం వారిని వాడుకుంటోంది. అంటే మనం మితవాదిగా ప్రశంసించే ఖాద్రీయే సైన్యం చేతుల్లో రాజకీయ మిలీషియా పాత్ర ను పోషించారు. అదే సైన్యం ఇప్పుడు ఈ రెండు గ్రూపులపైనా ద్విముఖ సైనిక చర్యను ప్రారంభించింది. కానీ లష్కరే, జైషేల వంటి ఉగ్రవాద సంస్థలను మాత్రం కాపాడుతోంది. జాతీయ భద్ర తా రాజ్యానికి నిర్వచనం ఇదే. ఇందులో సైన్యం/భద్రతా వ్యవస్థ ఎవరికి వారే శత్రువు ఎవరో నిర్వచించుకుని ఎవరికి తోచిన రీతిలోవారు... అది ఎంత హేతువిరుద్ధమైనాగానీ పోరాడుతుంటారు. ఇక మిగతా వ్యవస్థా, సంస్థలు, చివరికి మతపెద్దలు అత్యంత ప్రాధాన్యం గల ఆ విజయ సాధన కోసం దానికి సహాయపడుతుంటారు.
ఈ విధంగా పాకిస్తాన్ తన్ను తాను జాతీయ భద్రతా రాజ్యంగా నిర్వచించుకోవడంతో, తన స్థానాన్ని సమంజసమైనదిగా చూపటం కోసం నిరంతరం ఎవరో ఒకరితో యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి ఇతర సమాజాల్లాగానే అది కూడా తనపైనా, తన ప్రజలపైనా తానే యుద్ధం చేయాల్సి వస్తోంది. వజీరిస్తాన్, సరిహద్దు రాష్ట్రాల్లో జరుగు తున్నది ఇదే. అందుకే మనం పాకిస్తాన్ తనను తాను వెయ్యేళ్ల యుద్ధంలోకి ఈడ్చుకున్నదనే విషయాన్ని ఇంత విస్తృతంగా చర్చించాల్సి వస్తోంది.
వ్యాసకర్త: శేఖర్ గుప్తా